చాలా మందికి సహజంగానే రాత్రి పడుకుంటే తెల్లవారే వరకు మెళకువ రాదు. కేవలం వయస్సు మీద పడుతున్న వారికి మాత్రమే నిద్ర సరిగ్గా పట్టదు కనుక రాత్రి పూట మెళకువ వస్తుంది. ఇక చిన్న పిల్లలు అయితే రోజంతా నిద్ర పోతారు కనుక సహజంగానే వారు రాత్రి పూట లేచి ఆడుతుంటారు. ఇది సహజమే. కానీ మిగిలిన ఎవరికైనా రాత్రి పూట మెళకువ వస్తుందంటే దాని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా రాత్రి పూట చాలా మంది 3 గంటల సమయంలో నిద్ర లేస్తుంటారు. సడెన్‌గా మెళకువ వస్తుంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాత్రి పూట కొందరికి సహజంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతుంటాయి. డయాబెటిస్ ఉన్నవారితోపాటు కొందరిలో ఇలా జరుగుతుంది. దీంతో ఆకలి అవుతుంది. వెంటనే నిద్రలేచి ఏదైనా తినమని మెదడు సూచన పంపుతుంది. అందుకనే ఆ సమయంలో మెళకువ వస్తుంది.
2. మన జీవ గడియారం ప్రకారం రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య లివర్ మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు శ్రమిస్తుంటుంది. అయితే లివర్ సరిగ్గా పనిచేయకపోయినా ఆ సమయంలో మెళకువ వస్తుంది.
3. ఒత్తిడి, ఆందోళనలతో తీవ్రంగా బాధపడేవారు రాత్రి 3 గంటలకు నిద్రలేవడం సాధారణమే అని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. వారు ఆ సమయంలో నిద్రలేస్తే ఇక మళ్లీ నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.
4. రాత్రి 10-11 గంటలకు నిద్రించే వారు 3 గంటల వరకు గాఢ నిద్రలోకి జారుకుంటారు. కొందరికి ఈ సమయంలో గాఢ నిద్ర తేలిపోతుంది. అందుకని మెళకువ వస్తుంది.
5. ప్రోస్టేట్ సమస్యలు ఉన్నవారు, ప్రీ డయాబెటిస్ (డయాబెటిస్ వచ్చేందుకు ముందు దశ) ఉన్నవారు, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేని వారు, రాత్రి బాగా నీటిని తాగేవారికి కూడా ఆ సమయంలో మెళకువ వస్తుంది.
6. మహిళలు రాత్రి 3 గంటలకు నిద్ర లేస్తున్నారంటే వారిలో హార్మోన్ల సమస్యలు ఉన్నాయని అర్థం.
రాత్రి 3 గంటలకు మెళకువ వస్తే ఆ సమయంలో కొందరు ఆందోళనకు గురవుతుంటారు. కానీ కంగారు పడాల్సిన పనిలేదు. ఆకలిగా ఉంటే ఏదైనా తినేయాలి. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటే కొంత సేపు ధ్యానం చేయాలి.
రాత్రి నిద్రించే ముందు పాలలో తేనె కలుపుకుని తాగితే చక్కగా నిద్ర పడుతుంది. పాలలో కొద్దిగా అశ్వగంధ చూర్ణం కలుపుకుని కూడా తాగవచ్చు. దీంతో కూడా నిద్ర బాగా పడుతుంది. మధ్యలో మెళకువ రాదు. అలాగే చెర్రీ పండ్లను రాత్రి పూట తింటే చక్కగా నిద్రపోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే రాత్రి సమయంలో మెళకువ రాకుండా ఉంటుంది. అలాగే మహిళలు రోజూ యోగా వంటివి చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే రాత్రి మెళకువ రాకుండా చూసుకోవచ్చు.