Amla Juice : అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. నిత్యం పలు రకాల వ్యాయామాలు చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహిస్తుంటారు. బరువును పెంచే ఆహారాలు కాకుండా బరువును తగ్గించే ఆహారాల కోసం చూస్తుంటారు. అయితే ఇలాంటి ఆహారాల విషయంలో ఉసిరికాయ జ్యూస్ ఎంతగానో పనిచేస్తుంది. ఈ సీజన్‌లో విరివిగా లభించే ఉసిరికాయలను జ్యూస్ రూపంలో నిత్యం తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి ఉసిరికాయ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
ఉసిరికాయలలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో జ్వరం, దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఉసిరికాయలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఉసిరికాయల్లో హైపోలిపిడీమిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మన శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఉసిరికాయ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.