Honey : తేనెను రోజూ తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఆయుర్వేద వైద్యంలో తేనెను ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తేనెను తీసుకోవడం వల్ల పలు వ్యాధుల నుంచి మనం బయట పడవచ్చు. అయితే తేనెను తీసుకునేవారు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తేనెను కొన్ని ఆహారాలతో కలిపి అసలు తీసుకోకూడదు. తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. కనుక తేనెను ఏయే ఆహారాలతో తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెను ఎట్టి పరిస్థితిలోనూ మరిగించకూడదు. అలాగే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ఆహారాలతోనూ తేనెను కలిపి తినకూడదు. అందుకనే తేనెను గోరు వెచ్చగా ఉన్న ఆహారాలతోనే తినాలని ఆయుర్వేదం చెబుతోంది. తేనెను వేడిగా ఉన్న ఆహారాలతో తీసుకుంటే మన శరీరంలో ఆమం ఎక్కువగా తయారవుతుంది. ఆయుర్వేద ప్రకారం ఇది మనకు ఎంతమాత్రం మంచిది కాదు. కనుక తేనెను వేడి చేయరాదు, అలాగే వేడిగా ఉన్న ఆహారాలతో తీసుకోరాదు. ఇక తేనెను నెయ్యితో కూడా కలిపి తినకూడదు. రెండూ ఒకేసారి కలిపి తీసుకోవాల్సి వస్తే.. అందులో నెయ్యి ఎక్కువ భాగం ఉండేలా చూసుకోండి.
తేనెను వీటితో కలిపి తినకూడదు..
నెయ్యి, తేనెలను సమాన భాగాల్లో తింటే శరీరంలో జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతోపాటు శరీరంలో హానికర వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇది మనకు ఏమాత్రం మంచిది కాదు. కనుక నెయ్యి, తేనెలను కలిపి తీసుకోకపోవడమే మంచిది. రెండింటినీ తీసుకునేందుకు కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోండి. అలాగే ముల్లంగిని కూడా తేనెతో కలిపి తినకూడదు. తింటే శరీరంలో హానికర గ్యాస్‌లు పేరుకుపోతాయి. ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. కాబట్టి ముల్లంగిని కూడా తేనెతో కలిపి తినకూడదు.
పులియబెట్టిన ఆహారాలు, చేపలు, సోయా బీన్ ఉత్పత్తులు, ఉల్లిపాయలు, మాంసాహారాలతోనూ తేనెను కలిపి తినకూడదు. తింటే శరీరంలో జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో టాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. వ్యర్థాలు పేరుకుపోతాయి. కనుక ఆయా ఆహారాలతో తేనెను ఎట్టి పరిస్థితిలోనూ కలిపి తినకూడదు. తేనెను తినే విషయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు.