Sprouts : శరీరానికి కావల్సిన సకల పోషకాలు అన్నీ మొలకెత్తిన విత్తనాలలో ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మొలకెత్తిన విత్తనాలను సంపూర్ణ ఆహారంగా చెప్పవచ్చు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియడం వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది వీటిని తినడం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే మనలో చాలా మంది తెలిసీ తెలియక వీటిని తినే విషయంలో చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు.
మొలకెత్తిన విత్తనాలను నమలడం కొద్దిగా కష్టంతో కూడిన పని. వీటిని తినడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కనుక చాలా మంది వీటిని జ్యూస్ చేసుకొని తాగేస్తుంటారు. ఇదే మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు. మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ చేసి తాగడం వల్ల వీటిలో ఉండే పోషకాలు శరీరానికి ఎక్కువగా అందవు. మొలకెత్తిక విత్తనాలను నమిలినప్పుడు మన నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మొలకెత్తిన విత్తనాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. జ్యూస్ చేసి తాగడం వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవ్వవు. కనుక శరీరం వీటిని సంగ్రహించుకోలేదు.
మొలకెత్తిన విత్తనాలను నమిలినప్పుడు వీటిని జీర్ణం చేయడానికి జీర్ణాశయం, ప్రేగులల్లో రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ప్రేగులు పోషకాలను ఎక్కువగా శోషించుకుంటాయి. ఈ విత్తనాలను జ్యూస్ చేసి తాగడం వల్ల రసాయనాలు ఉత్పత్తి ఎక్కువగా జరగక మన ప్రేగులు వీటిల్లో ఉండే పోషకాలను ఎక్కువగా శోషించుకోలేవు. ఈ పోషకాలన్నీ మలం ద్వారా బయటకు పోతాయి. మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ చేసి తాగడం వల్ల వీటి రుచి కారణంగా వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కనుక వీటిని ఎలా తీసుకోవాలి సందేహం చాలా మందికి వస్తుంది. మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ చేయకుండా గింజల రూపంలోనే ఉండేలా చూసుకోవాలి. వీటిలో తేనె, నిమ్మరసం, ఖర్జూర, దానిమ్మ గింజలు, ఎండు ద్రాక్ష, ఉల్లి పాయ ముక్కలు వేసుకుని తినడం వల్ల రుచి కొద్దిగా మెరుగుపడుతుంది. కనుక సులభంగా తినవచ్చు. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తినడమే మనకు చాలా మంచిది. ఇలా నేరుగా తినడం వల్లనే మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి.