Drinking Water According To Body Weight : భూమిపై ఉన్న ప్రతి జీవరాశికి.. ఆమాటకొస్తే మనుషులకు కూడా నీరు ఎంతో అవసరం. నీళ్లు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. నీరు సకల ప్రాణికోటికి జీవనాధారం. నీటిని తాగడం వల్ల మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఆహారం లేకపోయినా మనం కొద్ది రోజుల పాటు జీవించవచ్చు. కానీ నీళ్లు లేకపోతే 1 లేదా 2 రోజులకు మించి మనం బతకలేం. నీళ్లను తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. అధిక బరువు తగ్గుతారు. మెటబాలిజం ప్రక్రియ సులభతరం అవుతుంది. అలాగే కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. అయితే ప్రతి మనిషికి తన బరువును బట్టే నీళ్ల అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే మన శరీర బరువుకు అనుగుణంగా మనం ఎన్ని నీళ్లను రోజూ సేవించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన శరీర బరువు ఒక కిలోకు 35ఎంఎల్ నీళ్లు అవసరం అవుతాయి. అంటే సుమారుగా 50 కిలోల బరువు ఉన్న వ్యక్తికి 35ఎంఎల్*50=1750ఎంఎల్ నీళ్లు అవసరం అవుతాయి. అంటే అతను రోజుకు 1.75 లీటర్ల నీళ్లను తాగాలన్నమాట. ఇలా ఎవరి శరీర బరువుకు తగినట్లు వారు లెక్క వేసుకుని ఆ ప్రకారం రోజూ నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
అయితే వేసవిలో మన శరీరం నుంచి సహజంగానే నీళ్లు చెమట రూపంలో ఎక్కువగా వెళ్లిపోతుంటాయి. కనుక పైన చెప్పిన లెక్క మారుతుంది. అంతకు రెట్టింపు మొత్తంలో నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి సక్రమంగా నీళ్లు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఏదైనా సరే అతి చేయకూడదు అన్న సామెతగా.. నీళ్లను కూడా మనం అతిగా సేవించరాదు. సేవిస్తే లేని పోని సమస్యలు వస్తాయి. కనుక మన శరీరానికి అవసరం ఉన్నన్ని నీళ్లను మాత్రమే తాగాల్సి ఉంటుంది.