Farting : మనల్ని వేధించే వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలల్లో అపానవాయువు కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరూ దీని గురించి మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు. అపానవాయువు అనేది చాలా సహజ సిద్దమైనది మరియు ఆరోగ్యకరమైనది. జీర్ణక్రియ సమయంలో తయారైన వాయువులను శరీరం బయటకు పంపే ఒక విధానం. అపానవాయువు చాలా సహజ సిద్దమైనదే అయినప్పటికి స్నేహితులతో ఉన్నప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఈ సమస్య కొందరిలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారు తరుచూ అపానవాయువును విడుదల చేస్తూ ఉంటారు. పంచదార ఎక్కువగా ఉండే వాటిని, ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
అలాగే గర్భిణీ స్త్రీలు, నెలసరి సమయంలో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అపాన వాయువు సహజసిద్దమే అయినప్పటికి తరుచూ వస్తూ ఉంటే తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది సమస్య నుండి బయటపడడానికి మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు. కడుపులో గ్యాస్ తక్కువగా ఉత్పత్తి అవ్వడానికి ఇవి సహాయపడినప్పటికి వీటిని తరుచూ వాడడం మంచిది కాదు. వీటికి బదులుగా ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అపానవాయువు సమస్యతో బాధపడే వారు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడానికి బదులుగా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తింటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల కడుపుపై భారం పడి గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కనుక తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సులభంగా అవుతుంది. తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని కూడా బాగా నమిలి తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు కార్బోనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే వైద్యున్ని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టు మందులు వాడడం మంచిది కాదు. ఇవి కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి. దీంతో అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. కనుక అపానవాయువు సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.