Fenugreek Seeds : మనల్ని వేధిస్తున్న షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాటిలో మెంతుల వాడకం కూడా ఒకటి. మెంతులను వాడడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెప్పడంతో ప్రతి ఇంట్లో మెంతుల వాడకం ఎక్కువైంది. ప్రతిరోజూ ఆహారంలో ఏదో ఒక రూపంలో వీటిని వాడుతున్నాం. వీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. జీర్ణాశయ సమస్యలకు మెంతులు చక్కటి ఔషధం. మధుమేహం అదుపునకు, అధిక బరువు తగ్గడానికి ఇవి దోహదపడతాయని రుజువైంది. దీంతో మెంతులను వాడుతూ షుగర్ మందులను మానేయవచ్చా అనే సందేహం అందరిలోనూ మొదలైంది. అయితే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు మెంతులు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ ఉన్న వారిలో మెంతులను ఎవరు వాడవచ్చు ఎవరు వాడకూడదు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. యువతి యువకులు, నడి వయసు వారు, మధుమేహం ఉందని అప్పుడే గుర్తించిన వారు, అధిక బరువు ఉన్న వారు, మధుమేహం వల్ల ఇతర దుష్ప్రభావాలు ఏమి లేవని క్షుణ్ణంగా పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకున్న వారు మెంతులను వాడవచ్చు. అలాగే పది సంవత్సరాల లోపు పిల్లలు, 70 ఏళ్లు దాటిన వృద్ధులు మెంతులను వాడకపోవడమే ఉత్తమం. మధుమేహం వచ్చిన మొదటి 5 సంవత్సరాల లోపే మెంతుల ప్రభావం ఉంటుంది. ఆ తరువాత మెంతుల మీద ఆధారపడడం ఏ మాత్రం మంచిది కాదు. వైద్యులు ఒక మెట్ ఫార్మిన్ కాకుండా ఇన్సులిన్, పయో గ్లిటజాన్ వంటి ఇతరత్రా మందులను సూచించినప్పుడు మెంతులు వాడుతున్నామన్న మిషతో ఆ మందులు వాడకపోవడం, మానివేయడం మంచిది కాదు.
అలాగే గాయాలు మానకపోవడం, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతరత్రా సమస్యలు ఉన్న వారు కూడా మెంతులు వాడకపోవడమే ఉత్తమం. వీరు వైద్యులు సూచించిన మందులు వాడడమే మంచిది. అలాగే ప్రేగుల్లో పుండ్లు, అల్సర్లు ఉన్న వారు, మరీ సన్నగా ఉన్న వారు, బరువు తక్కువగా ఉన్న వారు మెంతులను వాడకపోవడమే మంచిది. అలాగే గర్భవతులు, జ్వరం వచ్చిన వారు, ధైరాయిడ్ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మెంతులు వాడకపోవడమే మంచిది. ఇన్సులిన్ తో పాటు ఇతరత్రా మందులు వాడే వారు వాటిని మానేసి మెంతులకు మారడానికి వీలు లేదు.
అలాగే మెంతులు తీసుకుంటున్నామని రక్తపరీక్షలు మానేయడం కూడా మంచిది కాదు. చాలా మంది మధుమేహం అదుపులో ఉందో లేదో తెలియకుండానే మెంతులను వాడుతూ కాళ్ల మీద పుండ్లు తయారయినప్పుడో , గుండె సంబంధిత సమస్యల బారిన పడినప్పుడో మందులను వాడుతూ ఉంటారు. మెంతులను వాడినా, మందులను వాడినా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం లేని తెలిసిన మరుక్షణం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.