Janthikalu Recipe : జంతిక‌లు చేసేట‌ప్పుడు వీటిని క‌ల‌పండి.. ఎంతో రుచిగా వ‌స్తాయి.. క‌ర‌క‌ర‌లాడుతాయి..

Janthikalu Recipe : మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో జంతిక‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని పండుగ‌ల‌కు అలాగే అప్పుడ‌ప్పుడు స్నాక్స్ గా కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ జంతిక‌ల‌ను కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా గుల్ల‌గుల్ల‌గా ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. జంతిక‌ల‌ను రుచిగా గుల్ల గుల్ల‌గా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జంతిక‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుట్నాల పప్పు – ఒక టీ గ్లాస్, బియ్యం పిండి – 4 టీ గ్లాసులు, వాము – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, వేడి నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Janthikalu Recipe in telugu mix these for perfect taste
Janthikalu Recipe

జంతిక‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పుట్నాల ప‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో జ‌ల్లెడ‌ను ఉంచి అందులో బియ్యం పిండి, మిక్సీ ప‌ట్టుకున్న పుట్నాల ప‌ప్పు పొడి వేసి జ‌ల్లించుకోవాలి. ఇలా జ‌ల్లించుకున్న పిండిలో వాము, ఉప్పు, కారం వేసి క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా వేడి నీటిని పోస్తూ పిండిని ఒకేసారి క‌ల‌ప‌కుండా త‌డి పొడిగా క‌లుపుకోవాలి. ఇలా పిండిని క‌లుపుకున్న త‌రువాత దానిపై మూత‌ను ఉంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యే లోపు కొద్దిగా పిండిని తీసుకుని త‌గిన‌న్ని వేడి నీళ్లు పోసి మ‌రీ మెత్త‌గా కాకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు జంతిక‌ల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి. ఇప్పుడు జంతిక‌ల గొట్టంలో పిండిని ఉంచి నూనెలో జంతిక‌ల‌ను వ‌త్తుకోవాలి. నేరుగా నూనెలో జంతిక‌ల‌ను వ‌త్తుకోవ‌డం రాని వారు చిల్లుల గంటె మీద లేదా ప్లేట్ మీద నూనె రాసి దానిపై జంతిక‌ల‌ను వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి.

ఇలా నూనెలో వేసిన జంతిక‌ల‌ను వెంట‌నే క‌దిలించ‌కూడ‌దు. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత గంటెతో క‌దుపుతూ కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే పిండిని క‌లిపే ప్ర‌తిసారి నీళ్లు వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే జంతిక‌లు త‌యార‌వుతాయి. ఈ జంతిక‌ల‌ను గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే త‌యారు చేసిన జంతిక‌ల‌ను స్నాక్స్ గా తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎక్కువ‌గా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Share
D

Recent Posts