Sleep : మన శరీరానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవసరం. శరీరానికి తగినంత నిద్రలేకపోతే మనం అనారోగ్యాల బారిన పడతాం. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రపట్టడానికి చాలా మంది స్లీపింగ్ పిల్స్ ను వాడుతుంటారు. వీటి వల్ల నిద్రపట్టినప్పటికి దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. నిద్ర ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే ముందులు వాడడం సరైన పద్దతి కాదు. అసలు ముందు నిద్రపట్టకపోవడానికి లోపం ఎక్కడ ఉందో గుర్తించాలి. నిద్రపట్టకపోవడానికి ఒత్తిడి, ఆలోచనలు, పగలంతా కాఫీలు తాగడం వంటి ఎన్నో విషయాలు దోహదం చేస్తాయి. అలాగే పడుకునే ముందు ల్యాప్ టాప్, ఫోన్ వంటివి చూడడం వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. శరీరంలో ఉండే ఇతరత్రా శారీరక బాధలు కూడా నిద్రపట్టకుండా చేస్తాయి.
ఇవి అన్నీ కూడా నిద్రపట్టకపోవడానికి కారణాలే. ముందు మన అలవాట్లను, జీవనశైలిని చూసుకుని వాటిలో మార్పులు చేయాలి. నిద్రకు కాగ్నిటివ్ బీహెవియర్ థెరపీ ద్వారా వైద్యం ఎంతో ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొన్ని చిన్ని చిట్కాల ద్వారా నిద్రను తెప్పిస్తారు. అందులో ప్రధానమైనవి రాత్రి సమయంలో గడియారం వైపు చూస్తూ కూర్చుంటే రాత్రంతా భారంగా గడుస్తుంది. కనుక గోడ గడియారంపై దృష్టిని పెట్టక అంతరంగిక గడియారంపై చూపును ఉంచాలి. మనకు కావల్సిన నిద్రను, మెలుకువను నిర్ణయించేది ఈ అంతరంగిక గడియారమే. నిద్రపోయేటప్పుడు గడియారం కనబడకుండా చూసుకోవాలి.
నిద్రపట్టనప్పుడు గడియారాన్ని చూస్తే ఒత్తిడి మరింత పెరుగుతుంది. నిద్రపోయేటప్పుడు కూడా టీవీలను, సెల్ ఫోన్ లను, ల్యాప్ టాప్ లను పెట్టుకుని చూస్తున్నాం. వీటి స్క్రీన్ ల నుండి వచ్చే బ్లూ లైట్ మనకు నిద్రపట్టకుండా చేస్తుంది. ఇది నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీంతో నిద్రపట్టదు. పడుకున్నా ఇంకా నిద్ర రావడం లేదనే వేదన మొదలవుతుంది. దీంతో నిద్ర సమస్యగా మారతుంది. ప్రస్తుత కాలంలో ఆలస్యంగా భోజనం చేయడం అలవాటుగా మారుతుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి నిద్ర పట్టడం కష్టం అవుతుంది. నిద్రపోవడానికి రెండు, మూడు గంటల ముందే భోజనం చేయాలి. ఆకలిగా అనిపిస్తే పడుకునే ముందు ఏదైనా జీర్ణమయ్యే దానిని తీసుకోవాలి.
నిద్రపోవడానికి రెండు గంటల ముందు కోక్ లాంటివి తాగకూడదు మరియు స్వీట్స్ తినకూడదు. గదిలో వెలుతురు ఎక్కువగా ఉంటే నిద్ర రాదు. కనుక గదిలో చీకటిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. దీని వల్ల మొదట్లో నిద్ర బాగానే వచ్చిన ఆల్కామాల్ స్థాయిలు తగ్గే కొద్ది నిద్ర సరిగ్గా ఉండదు. పగలు కాఫీ, టీ వంటి వాటిని రెండు నుండి మూడు కప్పులకు మించి తాగకపోవడం ఉత్తమం. నిద్రపోవడానికి రెండు గంటల ముందు వీటిని అసలు తాగకూడదు. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. వ్యాయామం నిద్రను పెంపొందిస్తుంది. కానీ నిద్రపోవడానికి రెండు గంటల ముందు వ్యాయామం చేయకూడదు.
నిద్రపోవడానికి ముందే మూత్రవిసర్జన చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడంలో నిద్రకు భంగం కలగకుండా ఉంటుంది. నిద్రపోవడానికి అరగంటముందే బెడ్ మీదకు చేరాలి. ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవాలి. నిద్రపోయే ముందు చక్కటి స్నానం చేసిన కూడా నిద్ర బాగా పడుతుంది. నిద్రపోవడానికి ముందు పుస్తకం చదవడం, సంగీతం వినడం వంటి మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే పనులు చేయాలి. పడుకునే ముందు అరటిపండును తినడం, పాలు తాగడం చేయాలి. ఇవి తీసుకున్నా కూడా నిద్ర బాగా పడుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.