Ginger And Jaggery : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి వంట ఇంటి పదార్థంగా ఉంది. అంతేకాక ఔషధంగా కూడా పనిచేస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలకు మనం అల్లాన్ని వాడుతుంటాం. అల్లాన్ని తినడం లేదా అల్లం రసం తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే అల్లంతోపాటు బెల్లం కూడా కలిపి తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రాత్రి భోజనం అనంతరం ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అల్లం, బెల్లం కలిపి తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సీజన్లు మారినప్పుడల్లా మనకు దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. ఇక చలికాలంలో ఈ సమస్యలు మనల్ని మరికాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. కానీ అల్లం, బెల్లం మిశ్రమం కలిపి తీసుకోవడం వల్ల ఈ అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అందువల్ల ఈ సీజన్‌లో అల్లం, బెల్లం మిశ్రమాన్ని కలిపి తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ సీజన్‌లో మనకు సహజంగానే జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అజీర్ణం, మలబద్దకం ఇబ్బందులకు గురి చేస్తాయి. కానీ రాత్రి పూట అల్లం, బెల్లం కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మలబద్దకం కూడా ఉండదు. మరుసటి ఉదయం సుఖంగా విరేచనం అవుతుంది. అలాగే ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకుంటే రాత్రి పూట వెచ్చగా ఉండవచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది. దీంతో చలి నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా ఈ సీజన్‌లో అల్లం, బెల్లం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక ఈ మిశ్రమాన్ని రోజూ మరిచిపోకుండా తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.