Glass Of Milk Daily : మనం పాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలను సంపూర్ణ ఆహారంగా చెబుతూ ఉంటారు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ కూడా పాలల్లో ఉంటాయి. మన శరీర శ్రేయస్సుకు పాల ఎంతో దోహదపడతాయి. చాలా మందికి పాలను తీసుకోవడం వల్ల తగినంత క్యాల్షియం లభిస్తుంది దీంతో ఎముకలు ధృడంగా మారతాయని మాత్రమే తెలుసు. కానీ రోజూ ఒక గ్లాస్ పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఒక గ్లాస్ పాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలల్లో ప్రోటీన్ ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమయ్యే తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి.
ఇవి కండరాల మరమ్మత్తుకు, పెరుగుదలకు ఎంతో అవసరం. క్యాల్షియం మాత్రమే కాకుండా పాలల్లో విటమిన్ ఎ, డి, బి12, ఫాస్పరస్, పొటాషియం వంటి అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పాలను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాలు మనకు ద్రవరూపంలో లభిస్తాయి. కనుక శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచడంలో, శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదే విధంగా పాలల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులతో పాటు ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. గుండె పనితీరును, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఇవి మనకు సహాయపడతాయి. పాలను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. బోలు ఎముకలు, ఎముకలు గుళ్లబారడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీర ధారుడ్యానికి చాలా మంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేసిన తరువాత పాలను తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు పాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పాలను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ప్రోటీన్, కొవ్వులు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో మనంరోజంతా తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. ఇక పాలను తీసుకోవడం వల్ల మనం చక్కగా నిద్రపోవచ్చు. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తీసుకోవడం వల్ల నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పాలు మనకు సహాయపడతాయి. పాలల్లో విటమిన్ ఎ, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. పాలను తాగడం వల్ల అందమైన, ఆరోగ్యమైన చర్మాన్ని పొందవచ్చు. ఈ విధంగా పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ప్రతి ఒక్కరు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పచ్చి పాలల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనల్ని వ్యాధుల బారిన పడేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు పాశ్చరైజ్డ్ పాలను వాడడం మంచిదని వారు చెబుతున్నారు.