Beans Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటుగా బీన్స్ తో కూడా అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బీన్స్ తో చేసుకోదగిన వంటకాల్లో బీన్స్ కర్రీ కూడా ఒకటి. దేనితో తినడానికైనా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా చేసే ఈ బీన్స్ కర్రీని బీన్స్ తినని వారు కూడా ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ కర్రీని చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ బీన్స్ తో రుచిగా, సులభంగా, తక్కువ సమయంలో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీన్స్ – పావుకిలో, నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్స్, కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, తరిగిన టమాట – 1, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బీన్స్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత బీన్స్ ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. తరువాత శనగపిండి, కొబ్బరిపొడి వేసి కలపాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
తరువాత నీళ్లు పోసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.