Grains For Weight Loss : నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. అధిక బరువుతో బాధపడే వారు ముందుగా సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే భోజనంలో తక్కువ క్యాలరీలు అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ధాన్యాలను చేర్చుకోవడం చాలా అవసరం. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేసే ధాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారు వారి ఆహారంలో క్వినోవాను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు క్వినోవాలో 120 కేలరీల శక్తి ఉంటుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో దీనిని వండుకోవచ్చు. క్వినోవా ధాన్యాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది కనుక వేగంగా బరువు తగ్గవచ్చు. ఇక అధిక ఫైబర్ ఉండే ధాన్యాలల్లో బార్లీ కూడా ఒకటి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.ఒక కప్పు బార్లీలో 193 క్యాలరీల శక్తి ఉంటుంది. సూప్ వంటి వాటి తయారీలో వీటిని ఉపయోగించవచ్చు. బార్లీని తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో బుక్వీట్ కూడా ఒకటి. ఒక కప్పు బుక్వీట్ లో 155 కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో గ్లూటెన్ తక్కువగా ఉండడంతో పాటు మట్టి రుచిని కలిగి ఉంటుంది. గంజి, పాన్ కేక్ వంటి వాటిలో దీనిని ఉపయోగించవచ్చు.
అలాగే బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవాల్సిన ధాన్యాలలో ఫారో కూడా ఒకటి. ఒక కప్పు ఫారో ధాన్యంలో 220 క్యాలరీల శక్తి ఉంటుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సలాడ్, సూప్ లలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కొర్రలను కూడా వారి ఆహారంలో చేర్చుకోవచ్చు. ఒక కప్పు కొర్రలల్లో 207 క్యాలరీల శక్తి ఉంటుంది. బియ్యానికి ప్రత్యామ్నాయంగా వీటిని వాడడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా జొన్నలను తీసుకోవడంవల్ల కూడా మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఒక కప్పు జొన్నలల్లో 316 క్యాలరీల శక్తి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు జొన్నలతో అన్నం, సంగటి, జావ వంటి వాటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఇక టెఫ్ అనే చిన్నరకం ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా మనం వేగంగా బరువు తగ్గవచ్చు.
ఒక కప్పులో 255 క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే ఐరన్, క్యాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా ఈ ధాన్యాలను తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఇలా ధాన్యాలను తీసుకోవడంతో పాటు జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవడం వల్ల మరింత వేగంగా బరువు తగ్గవచ్చు.