Kajjikayalu : మనం చేసుకునే పిండి వంటకాల్లో కజ్జికాయలు కూడా ఒకటి. కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పండగలకు వీటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచితో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే కజ్జికాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా కజ్జికాయలను సులభంగా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, రుచిగా, కమ్మగా కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కజ్జికాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, రవ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల పప్పు – ఒక కప్పు, ఎండుకొబ్బరి చిప్ప – చిన్నది ఒకటి, యాలకులు – 6, బెల్లం – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కజ్జికాయల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో రవ్వ, ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినన్నినీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై కొద్దిగా నూనె రాసి మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో పుట్నాల పప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని పక్కకు ఉంచాలి.
తరువాత పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పూరీలాగా వత్తుకోవాలి. తరువాత దీని మధ్యలో పుట్నాల మిశ్రమాన్ని ఉంచి అంచుల వెంబడి నీటితో తడి చేయాలి. తరువాత ఈ పూరీని కజ్జికాయల ఆకారంలో మడుచుకోవాలి. తరువాత అంచులను వత్తి ఫోర్క్ తో డిజైన్ వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కజ్జికాయలను వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.