పచ్చి మిరపకాయలు అంటే చాలా మందికి ఇష్టమే. నిత్యం కొందరు ప్రత్యేకం పచ్చి మిరపకాయలను అలాగే తింటుంటారు. చాలా మంది వీటిని కూరల్లో వేస్తుంటారు. అయితే కారం అన్నమాటే గానీ నిజానికి పచ్చి మిరప కాయల వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వంటలకు పచ్చిమిరపకాయల వల్ల చక్కని రుచి వస్తుంది. అలాగే వీటిలోని ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.
పచ్చిమిరప కాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు…
పచ్చి మిరప కాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
పచ్చి మిరపకాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండదు. అలాగే కొవ్వు పదార్థాలు కూడా ఇందులో ఉండవు. ఇక వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, సి, కె, ఫైటో న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.
అధిక బరువు తగ్గుతారు
అధిక బరువు తగ్గాలనుకునే వారికి పచ్చిమిరప కాయలు ఎంతగానో తోడ్పడుతాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచుతాయి. అంటే క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అందువల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు త్వరగా తగ్గుతారు.
గుండె ఆరోగ్యానికి
పచ్చి మిరపకాయల్లో బీటా-కెరోటీన్ ఉంటుంది. ఇది గుండె సంబంధ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాలు గట్టిపడడం, గుండె జబ్బులు రావడం, హార్ట్ స్ట్రోక్స్ రావడం వంటి గడ్డు సమస్యలు తప్పుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
జలుబు నుంచి ఉపశమనం
పచ్చి మిరప కాయల్లో క్యాప్సెయిసిన్ ఉంటుంది. ఇది మ్యూకస్ ఉన్న పొరల్లో రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో మ్యూకస్ పలుచగా మారుతుంది. ఫలితంగా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
శరీర రోగ నిరోధక శక్తి
తరచూ మన శరీరానికి సోకే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ లభించాలంటే మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అందుకు పచ్చి మిరప కాయలు ఎంతగానో తోడ్పడుతాయి. వీటిల్లో విటమిన్ సి, బీటా-కెరోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే పచ్చి మిరపకాయల్లో ఉండే విటమిన్ సి పోకుండా ఉండాలంటే వీటిని చల్లగా ఉండి, చీకటిగా ఉన్న ప్రాంతంలో నిల్వ చేయాలి. అప్పుడే వీటిలోని విటమిన్లు, ఇతర పోషకాలు నశించకుండా ఉంటాయి.
డయాబెటిస్‌కు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొన్ని కోట్ల సంఖ్యలో జనాలు డయాబెటిస్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో లక్షల మంది కొత్తగా ఏటా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే నిత్యం పచ్చి మిరపకాయలను తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారి షుగర్ లెవల్స్ మరీ తక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక పచ్చి మిరపకాయలను తినే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
సైడ్ ఎఫెక్ట్స్
పచ్చి మిరపకాయలను తరచూ తినడం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ వీటిని అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. పచ్చి మిరపకాయల వల్ల మనకు ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నప్పటికీ వీటిని అతిగా తినడం వల్ల మనకు హాని కూడా కలుగుతుంది.
* పచ్చి మిరపకాయలను అతిగా తింటే కొందరికి పడకపోవచ్చు. అలాంటి వారిలో కడుపులో తీవ్రమైన మంట కలుగుతుంది. పేగులు వాపుకు గురై కడుపునొప్పి సంభవిస్తుంది. కొందరికి విరేచనాలు కూడా అవుతాయి.
* పచ్చి మిరపకాయలను అతిగా తినడం వల్ల కొందరికి అజీర్తి సంభవించి నీళ్ల విరేచనాలు అవుతాయి. కొందరికి కడుపులో నొప్పి కూడా వస్తుంది. జీర్ణాశయ సమస్యలు రావచ్చు. అవి మరింత ఎక్కువయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది.
* పచ్చి మిరపకాయల్లో క్యాప్సెయిసిన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. దాని వల్ల కొందరికి స్కిన్ అలర్జీలు రావచ్చు. దాంతో చర్మంపై దద్దుర్లు ఏర్పడి దురదలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అందువల్ల పచ్చి మిరపకాయలను తక్కువ మోతాదులో తినాల్సి ఉంటుంది. అయితే సైడ్ ఎఫెక్ట్స్ మరీ తీవ్రతరం అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కొందరికి ఒక రోజు వరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించి తరువాత వాటంతట అవే తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక పచ్చి మిరపకాయలు అనే కాదు, ఏ ఆహారాన్ని అయినా సరే అతిగా తీసుకుంటే అనర్థాలే సంభవిస్తాయి. కాబట్టి దేన్నయినా మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365