యోగా అనే సంస్కృత పదం ‘యుజ్’ నుండి వచ్చింది, దీని అర్థం ‘ఏకం కావడం’. ఇది మనస్సు, శరీరం, ఆత్మ మధ్య ఏకీకృత సమతుల్యతను సూచిస్తుంది. గర్భధారణలో యోగా అనేది గర్భం యొక్క అనేక సవాళ్లను ఎదుర్కోవటానికి, శారీరక, మానసిక, భావోద్వేగ, మేథోపరమైన ప్రక్రియలకు ఉపయోగపడుతుంది. ప్రసవం అనేది ఒక భావోద్వేగ అనుభవం. కానీ ఒక అనుభూతిని ఆనందంగా, ఉల్లాసంగా ఆస్వాదించేందుకు యోగా ఉపయోగపడుతుంది.
యోగా భావోద్వేగ నియంత్రణకు సహాయపడుతుంది.శరీరానికి శక్తిని అందిస్తుంది. గర్భిణీలకు తమ గర్భంలో ఉన్న శిశువులతో బలమైన సంబంధాలను పెంచుకోవడానికి సహాయ పడుతుంది. నైపుణ్యాలు, విశ్వాసం, స్వీయ సామర్థ్యాలను పెంచుకునేందుకు యోగా ఉపయోగపడుతుంది. ప్రసవ సమయంలో నొప్పిని తట్టుకునేందుకు యోగా సహకరిస్తుంది. ఈ క్రమంలోనే గర్భిణీలతోపాటు పాలిచ్చే తల్లులు యోగా ద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీలకు సహజంగానే అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ యోగా చేయడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చు. యోగాను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల నిద్రలేమి, అలసట, అధికంగా బరువు పెరగడం, వెన్ను నొప్పి, మలబద్దకం, గర్భధారణ సమయంలో మధుమేహం ప్రమాదం, మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోలేకపోవడం, గర్భం ప్రేరిత రక్తపోటు, డిప్రెషన్, ఆందోళన వంఇ సమస్యలు వస్తాయి. కానీ అను నిత్యం యోగాను సాధన చేయడం వల్ల ఈ సమస్యలన్నింటి నుంచి బయట పడవచ్చు.
యోగా చేయడం వల్ల గర్భిణీలే కాదు, వారి శిశువులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. శక్తిని పెంచుతుంది. ఉదరం, కటి కండరాలను యోగా బలంగా చేస్తుంది. యోగా చేయడం వల్ల సహజంగా డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సిజేరియన్ కాకుండా చూసుకోవచ్చు. నెలలు నిండకుండానే శిశువు జన్మించే అవకాశాలను తగ్గించవచ్చు. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మానసిక స్థితి సరిగ్గా ఉంటుంది.
యోగాతోపాటు ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయడం వల్ల గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మరీ భారీ యోగా ఆసనాలు కాకుండా తేలిక పాటి యోగాసనాలను నిపుణులైన గురువుల సమక్షంలో వేస్తే మంచిది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365