Health Tips : ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట వంటి వాటితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఈ విధంగా నొప్పులతో బాధపడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. అనేక రకాల మందులను వాడుతూ ఉంటాం. మందులను వాడే అవసరం లేకుండానే ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్యలన్నింటి నుండి బయట పడవచ్చు. ఎంత తిన్నా కానీ నీరసంగా, బలహీనంగా, బరువు తక్కువగా ఉండే వారు చాలా మందే ఉంటారు. ఈ నీరసం కారణంగా మన పని కూడా మనం చేసుకోలేక పోతుంటాము. అంతేకాకుండా నీరసంగా ఉండడం వల్ల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల నీరసం తగ్గి, దృఢంగా తయారవుతారు.
అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మనల్ని వేధిస్తున్న నొప్పులు కూడా తగ్గుతాయి. మనల్ని బలంగా తయారు చేసే ఆ చిట్కా ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో నీరసాన్ని తగ్గించే అద్భుతమైన చిట్కా ఇది. ఇందుకోసం ముందుగా మనం గుప్పెడు శనగలను, 5 బాదం పప్పులను, 10 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. శనగల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. గుండె పని తీరును మెరుగుపరచడంలో, మెదడు చురుకుగా పని చేసేలా చేయడంలో ఈ శనగలు ఎంతగానో ఉపయోగపడతాయి. బాదం పప్పులను తినడం వల్ల కూడా మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి శనగలను, బాదం పప్పులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే దంతాలు శుభ్రం చేసుకున్న తరువాత పరగడుపున నానబెట్టుకున్న శనగలను, బాదం పప్పును బెల్లంతో సహా తిని ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు బెల్లాన్ని తీసుకోకుండా కేవలం శనగలను, బాదం పప్పులను మాత్రమే తినాలి. ఏదైనా పని చేసిన తరువాత ఎక్కువగా ఆయాసం వస్తున్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా శనగలను, బాదం పప్పును తినడం వల్ల శరీరంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల నీరసం, నొప్పులు తగ్గి బలంగా, పుష్టిగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు.