మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోనూ గుండె చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది లేకపోతే మనం అసలు బతకలేము. గుండె నిరంతరాయంగా పనిచేస్తుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవన విధానం కలిగి ఉండాలి. లేదంటే గుండె సంబంధ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతాయి. కానీ కొన్ని మాత్రం గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే నిత్యం సరైన డైట్‌ను పాటించాల్సి ఉంటుంది.
మనలో అధిక శాతం మంది ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. నిజానికి ఇవి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఆహారాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇవి మన గుండె ఆరోగ్యానికి మంచివి కావు. వీటి వల్ల గుండె జబ్బులు వస్తాయి. కనుక ఈ ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. వాటితో గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఫైబర్ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఇవి ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతో శరీరంలో వాపులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి కనుక వాటిని తరచూ తినడం వల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇక వెజిటేరియన్లు నట్స్, సీడ్స్ తినడం ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.
బాదంపప్పు, వాల్‌నట్స్ వంటి వాటిని నిత్యం గుప్పెడు మోతాదులో తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. నట్స్‌ను నిత్యం తినడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు.
అధికంగా బరువు ఉండడం వల్ల కూడా గుండె వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీని వల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
నిత్యం ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఉప్పలో ఉండే సోడియం శరీరానికి మంచిది కాదు. ఇది హైబీపీని కలగజేస్తుంది. గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. ఇక చక్కెర వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అది కూడా గుండె జబ్బులు వచ్చేందుకు దారి తీస్తుంది. కనుక ఈ రెండు పదార్థాలను నిత్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.