Heart Healthy Foods : మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో గుండె సంబంధిత సమస్యలు కూడా ఒకటి. జంక్ ఫుడ్ ను తీసుకోవడం, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. కొందరు గుండె సమస్యల కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అయితే శరీర ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా, గుండె సమస్యలు మన దరి చేరకుండా ఉండాలన్నా మనం మన ఆహారపు అలవాట్లల్లో చాలా మార్పులు చేసుకోవాలి. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా జంక్ ఫుడ్ కు, తీపి పదార్థాలకు, నూనెలో వేయించిన పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి.
కొవ్వు కలిగిన పదార్థాలకు బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ప్రోటీన్ మాంసాహారంలో ఎక్కువగాఉంటుందని భావిస్తారు. కానీ మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. తరుచూ మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు అధికమవ్వడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక మాంసాహారానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవాలి. పల్లీలు, రాజ్మా, సోయాచిక్కుళ్లు వంటి ఆహారాల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అలాగే శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి చాలా మంది అన్నాన్ని తీసుకోవడం మానేస్తున్నారు. అయితే అన్నానికి బదులుగా అంతే శక్తిని ఇచ్చే ఇతర ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈ విధంగా అన్నానికి బదులుగా ప్రోటీన్ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.