మల బద్ధకం అంటే ప్రతిరోజు ఒక నిర్ణీత కాలానికి విరోచనం కాకపోవడం. కొంతమందికి గడియారం కొట్టినట్టుగా ఒకే సమయానికి విరేచనం అవుతుంది. మరి కొంతమంది వారానికి ఏ రెండు సార్లు మూడుసార్లు అతి కష్టం మీద కడుపు కదిలే స్థితిని మలబద్ధకం అని అంటారు. ఒకసారి ఇది తీవ్రంగా మారి ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది వయస్సు మళ్ళిన వారిలో ఎక్కువగా ఉంటుంది. కారణాలు చాలా ఉన్నాయి. వేళ పాళ లేని జీవన విధానం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పేగుల కదలిక, హార్మోనుల ఇన్ బ్యాలెన్స్, కొన్ని రకాల మందులు వాడడం, కొన్ని రకాల వ్యాధులు ఉండడం, కొన్ని రకాల మానసిక వ్యాధులు ఉండడం, శారీరక లోపం వల్ల కూడా మలబద్దకం రావచ్చు.
సాధారణంగా ఏదైనా రోగం వచ్చిన తర్వాత మందులు వాడే దానికంటే రాకుండా నివారించుకోవడమే మంచిది. ఇది అందరూ చెప్పే మాట అయినప్పటికి కొందరు ఎప్పుడు అంటూనే ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే మలబద్ధకం అనేది చాలామంది చేజేతులా తెచ్చుకునే జబ్బు. సమయానికి భోజనం తినక పోవడం లేదా సమయానికి విరోచనానికి వెళ్లకుండా వాయిదా వేసుకోవటం బద్దకించటం, బయటికి వెళ్లడానికి అవకాశాలు లేకపోవడం, లాంటివి కూడా మనమే చేజేతులా చేసుకుంటాం.
మరి ఎలా తగ్గించుకోవాలి..? పేగుల కదలిక ఉండాలంటే శరీరానికి తగినంత నీళ్లు ఉండాలి. ప్రతిరోజు ఉదయం నీరు తాగడం తప్పనిసరిగా పెట్టుకోవాలి. మజ్జిగ మీద తేట క్రమంగా తాగడం అలవాటు చేసుకోవాలి. పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినాలి. చింతపండు, ఊరగాయ పచ్చడి, నూనె పదార్థాలను తక్కువగా తినాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. బీర, సొర, పొట్లకాయ వంటి కూరగాయలు తినాలి. పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలు తీసుకోవాలి. చారు తీసుకోవాలి.
మునక్కాడల లేత ఆకుకూర, పప్పు, పులుసు పచ్చడి తినాలి. ధనియాలు, జీలకర్ర, వాము ఈ మూడింటిని మెత్తగా దంచి పొడి చేసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకొని ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచాడు వేసుకొని మూడు పూటలా తాగితే విరోచనం ఫ్రీగా అవుతుంది. త్రిఫల చూర్ణం ఒక సెంచ మోతాదులో రోజు రెండుసార్లు మజ్జిగలో గాని నీళ్లలో గాని కలిపి తాగవచ్చు. ఇవి కాకుండా ఆయుర్వేద మందుల షాపులో దీనికి అనేక రకాల మందులు దొరుకుతాయి, డాక్టర్ సలహా మేరకు వాటిని వాడవచ్చు. మలబద్ధకాన్ని తేలికగా తీసుకోవద్దు. సరైన శ్రద్ధతో మలబద్ధకాన్ని నివారించుకోవడం మంచిది.