Milk : మనం ప్రతిరోజూ ఆహారంగా భాగంగా పాలను తీసుకుంటూ ఉంటాం. ఇష్టం ఉన్నా లేకున్నా పాలను తాగాల్సిందేనని పెద్దలు చెబుతూ ఉంటారు. పాలను త్రాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. అలాగే పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. పాలను త్రాగడం వల్ల ఎముకల ధృడంగా ఉంటాయని ముఖ్యంగా పాలను పిల్లలకు ఆహారంగా ఇవ్వాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అసలు పాలు మన శరీరానికి ఎంత అవసరం, పాల చుట్టూ ఉన్న సందేహాలు, అపోహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే పిల్లలకు క్యాల్షియం చాలా అవసరం. 10 నుండి 12 లోపు సంవత్సరాల వారికి 400 మిల్లీ గ్రాములు, 20 సంవత్సరాల లోపు వారికి రోజుకు 600 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది.
100 ఎమ్ ఎల్ చిక్కటి గేదె పాలల్లో 200 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. చిక్కటి ఆవు పాలల్లో 120 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. నీళ్లు కలిపిన గేదె పాలల్లో, చిక్కటి ఆవు పాలల్లో పోషకాలు సమానంగా ఉంటాయి. పిల్లలకు రోజుకు సరిపడా క్యాల్షియాన్ని అందించాలంటే అర లీటర్ పాల వరకు వారికి ఆహారంగా ఇవ్వాలి. పూర్వకాలంలో ఇతర ఆహారాలు ఎక్కువగా ఉండేవి కావు. అలాగే అందరికి ఇంట్లో పాలు సమృద్ధిగా ఉండేవి. కనుక వారు శరీరానికి కావల్సిన క్యాల్షియం కోసం పాలను ఎక్కువగా తీసుకునే వారు. కానీ పిల్లలకు పాలు తప్పకుండా ఇవ్వాలి.. పాలు త్రాగకపోతే క్యాల్షియం అందదు అనేది ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకనగా పాలకంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. తోటకూరలో 400 మిల్లీ గ్రాములు, పొన్నగంటి కూరలో 510 మిల్లీ గ్రాములు, మునగాకులో 440 మిల్లీ గ్రాములు, కరివేపాకులో 830 మిల్లీ గ్రాములు, నువ్వుల్లో 1450 మిల్లీ గ్రాములు, నల్ల నువ్వుల్లో 1650 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటన్నింటిలో పాలకంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. అలాగే ఇవి పాలకంటే తక్కువ ధరలో కూడా లభిస్తాయి. కనుక పాలను త్రాగకపోయిన మనకు ఎటువంటి నష్టం కలగదు. పాలకు బదులుగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల పాలకంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే పాలు సంపూర్ణ ఆహారం అని చాలా మంది భావిస్తూ ఉంటారు. 100 ఎమ్ ఎల్ చిక్కని పాలల్లో 3.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ పిల్లలకు ఒక కిలో బరువుకు 2 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది.
కనుక పిల్లలకు పాలతో పాటు ఇతర పోషకాలు ఉన్న ఆహారాలను కూడా ఇవ్వాలి. అలాగే ప్రస్తుత కాలంలో గేదెల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి అనేక రకాల మందులను, స్టెరాయిడ్స్ ను ఉపయోగిస్తున్నారు. అలాగే వాటిని కృత్రిమంగా కూడా తయారు చేస్తున్నారు. కనుక పోషకాల కోసం పాల మీద ఎక్కువగా ఆధారపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా చాలా మంది రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలను ఆహారంగా ఇస్తూ ఉంటారు. పాలను తాగడం వల్ల కలిగే లాభాల కంటే రాత్రి పడుకునే ముందు తాగిన పాల వల్ల పిల్లలకు ఎక్కువ నష్టం కలుగుతుందని, ఆకలి కాకుండా తాగిన పాలు జీర్ణం అవ్వవని నిపుణులు చెబుతున్నారు.