Corn : వర్షం పడుతున్నప్పుడు మనకు వేడి వేడి గా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మొక్కజొన్న కంకులు. వీటిని ఇష్టపడని వారు ఉండరు. మొక్కజొన్న కంకులను మనం వివిధ రూపాలలో ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. మొక్కజొన్న కంకులను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న పిండితో కూడా మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మొక్క జొన్నను ఏవిధంగా తీసుకున్నా కూడా మనకు మేలు కలుగుతుంది.
మొక్కజొన్న పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ప్రేగు కదలికలు పెరిగి మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తినడం వల్ల గర్భస్త శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. మొక్కజొన్నను తరచూ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక బరువు తక్కువగా ఉన్నవారు వీటిని తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
మూత్రపిండాల పని తీరును మెరుగుపరచడంలో, ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడంలో కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి. మొక్కజొన్నలలో అధికంగా ఉండే ఐరన్ రక్త హీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్క జొన్నలు ఒక బలవర్ధకమైన ఆహారం. మొక్కజొన్న గింజలతో పాప్ కార్న్, పేలాలు, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని తయారు చేస్తారు. లేత మొక్కజొన్న కంకులను మనం సలాడ్ లలో, కూరలలో ఉపయోగిస్తాం. మొక్కజొన్న పిండితో కూడా రొట్టెలను తయారు చేస్తారు. మొక్కజొన్న గింజల నుండి నూనెను కూడా తీస్తారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు మొక్కజొన్నలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కజొన్న ఎంతగానో దోహదపడుతుంది.
మొక్కజొన్నను పశువులకు, కోళ్లకు దాణాగా కూడా ఉపయోగిస్తారు. అనేక రకాల పారిశ్రామిక ఉత్తత్పుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. మొక్కజొన్న కంకులే కాకుండా మొక్కజొన్న వేర్లు, కాండం నుండి తీసిన కషాయాన్ని తాగడం వల్ల కూడా మన శరీరానికి మేలు కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మొక్కజొన్నను అధిక మొత్తంలో పండిస్తున్నారు. పూర్వకాలంలో వీటిని కేవలం కాల్చుకుని తినేవారు. కానీ ప్రస్తుత కాలంలో వీటిని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా మొక్కజొన్నను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.