అసమయ భోజనాలు, ఆహారం అతిగా తినడం, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, మందులను అధికంగా వాడడం.. వంటి అనేక కారణాల వల్ల కడుపులో మంట సమస్య వస్తుంది. దీంతోపాటు కడుపు ఉబ్బరం, ఛాతిలో మంట కూడా ఏర్పడుతుంటాయి. అయితే ఈ సమస్య వస్తే పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసిడిటీ సమస్య ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి. ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి సుమారు రెండు గంటలకు ముందే భోజనం తీసుకోవాలి. వేళకు భోజనం, వేళకు నిద్ర మంచి అలవాట్లు కలిగి ఉండాలి. భోజనం మధ్యలో కొద్దిగా మాత్రమే నీరు తాగాలి. ఆహారం బాగా నమిలి తినాలి. ఆహారం తీసుకున్న తర్వాత నెమ్మదిగా నడవాలి. మనస్సు విప్పి స్నేహితులతోనూ, ఆప్తులతోనూ మాట్లాడుకుంటే ఆదుర్దా వల్ల వచ్చే ఎసిడీటీ తగ్గుతుంది.
వేళకి భోజనం చెయ్యడానికి వీలుపడకపోతే ఏదో ఒకటి తినాలి. కనీసం రెండు గ్లాసుల మంచినీరైనా తాగితే ఎసిడిటి కొంతవరకు తగ్గుతుంది. మంచి ఆహారపుటలవాట్లు, పోషకాహారం అవసరం. ఉదయం, సాయంత్రం నడవాలి. ఒత్తిడి తగ్గేలా జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. కనీసం ఏడు అంగుళాల ఎత్తైన దిండు పెట్టుకోవడం మంచిది. జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యే సమయాల్లో భుజించాలి. అవి ఉదయం ఆరు నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు డిన్నర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.