Vivid Dreams : సాధారణంగా ప్రతి ఒక్కరికి నిద్రపోయిన తరువాత కలలు వస్తుంటాయి. కొందరికి నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కలలు వస్తే.. కొందరికి పిచ్చి పిచ్చి కలలు వస్తాయి. ఇంకొందరికి పీడ కలలు వస్తాయి. అయితే కొందరికి వచ్చే కలలు మాత్రం నిజంగానే జరిగినట్లు అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే అది కలనా, నిజంగా జరిగిందా.. అన్నంతగా పోల్చుకోలేకుండా కలలు వస్తుంటాయి. అయితే ఇలాంటి కలలు కనుక వస్తే అందుకు పలు కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజూ నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో కాలాన్ని గడుపుతున్నాం. దీంతో చాలా మంది ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. చాలా మందికి పని ఒత్తిడి ఉంటుంది. ఇంకొందరికి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు కూడా ఉంటాయి. అయితే వీటి వల్ల మనకు అచ్చం నిజంగానే జరిగినట్లు ఉండే కలలు వస్తాయట. ఈ కలలు వచ్చేందుకు ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనే కారణమని వైద్యులు చెబుతున్నారు.
కొందరికి నిద్రలేమి సమస్య ఉంటుంది. రోజూ రాత్రి పొద్దు పోయాక 12 లేదా 1 గంటకు నిద్ర పడుతుంది. అలాంటి వారికి కూడా ఇలాంటి నిజమైన కలలు వస్తాయట. ఇక యాంటీ డిప్రెస్సెంట్స్, బీపీని తక్కువ చేసే మందులు, పలు ఇతర వ్యాధులకు మెడిసిన్లను వాడేవారికి రియాలిటీకి దగ్గరగా ఉండే కలలు వస్తాయట. ఇలాంటి కలలను వారు అసలు సంఘటనలో లేదా కలలో తేల్చుకోలేకపోతారట.
అలాగే మద్యం విపరీతంగా సేవించేవారికి, మద్యం లేదా డ్రగ్స్ వాడకాన్ని సడెన్‌గా మానేసిన వారికి, షిజోఫ్రీనియా లాంటి మానసిక సమస్యలు ఉన్నవారికి, నిద్ర సరిగ్గా పోని వారికి, మెదడు యాక్టివిటీ సరిగ్గా లేనివారికి, గర్భంతో ఉన్న మహిళలకు తొలి దశలో ఇలాంటి కలలు వస్తాయట. అయితే వాస్తవానికి ఇలాంటి కలలు రోజూ రావు. లేదా కొన్ని రోజుల పాటు వచ్చి ఆగిపోతాయి. కానీ కొందరికి పదే పదే ఇలాంటి కలలు వస్తాయి. కొంతకాలం పాటు ఇలాంటి కలలు వచ్చి ఆగిపోతే వాటి వల్ల ఎలాంటి హాని కలగదు. కానీ ఇలాంటి కలలు అసలు ఎప్పటికీ వస్తూనే ఉంటే వెంటనే సైకియాట్రిస్టును కలిసి సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. లేదంటే ఏది నిజమైన సంఘటనో ఏది కలనో గుర్తించలేనంతగా మారిపోతారు. కనుక ఇలాంటి కలలు వచ్చే వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇబ్బందులకు గురవుతారు.