ఒక్కప్పుడు ట్యాటూ ( పచ్చబొట్టు) కేవలం చేతులపై ప్రేమతో తల్లిదండ్రుల పేర్లు, భక్తితో దేవుడి బొమ్మలను పొడిపించుకునేవారు. అప్పుడు కేవలం అలివ్ గ్రీన్‌లోనే ఉండేవి. ప్రస్తుతం ట్యాటూ సౌంధర్య సాధనంగా మారడంతో ఏ రంగు అంటే ఆ రంగుల్లో వేస్తున్నారు. వీటితో శరీరానికి అందం వస్తుందన్న మాట పక్కన పెడితే జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని జబ్బులు అంటుకునే ప్రమాదం కూడా ఉందంటున్నారు చర్మవ్యాధుల నిపుణులు. ట్యాటూ వేసేవారు ఓ పరికరంతో రంగురంగుల ద్రవ్యాలను శరీర పొరల్లోకి జొప్పిస్తారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తీవ్ర రక్తస్రావం కూడా కావచ్చు. వారు వాడే సూదులను పరిశుభ్రంగా కడగకపోవడంతో హైపటైటిస్ బి, సి వంటి ఇన్‌ఫెక్షన్లు సోకేందుకు ఆస్కారం ఉంటుంది.
కొన్ని ద్రవ్యాల్లో లోహాలుండటంతో ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎంఆర్ఐ తీసేటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు ఎంఆర్‌ఐ ఫలితాలు కచ్చితంగా రాకపోవచ్చు. శరీర పొరల్లోకి రంగులను జొప్పించడంతో చెమట గ్రంథుల పనితీరు సక్రమంగా పని చేయక చెమట ఉత్పత్తి సగానికి తగ్గిపోవచ్చు. క్రీడాకారులు పెద్దపెద్ద ట్యాటూ లు వేసుకోవడంతో వీరిపై అధిక ప్రభావం చూపుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరికి నీలి, ఆకుపచ్చ, ఎరుపు రంగుల మూలంగా అలర్జీ మొదలై దురదు పుడుతుంది.
టాటూ వేసేవారు ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కొని తప్పకుండా గ్లౌజ్‌లు ధరించాలి. స్టెరిలైజ్ చేసిన పరికరాన్నే వాడాలి. టాటూ వేసుకున్న తర్వాత శరీరానికి అతుక్కునే డ్రస్సులు ఏమాత్రం వేసుకోరాదు. టాటూ వేసుకున్న భాగంలో దుమ్మూ, ఎండ పడకుండా చూసుకోవాలి.