అధిక బరువు సమస్య నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. తిండి సరిగ్గా తిన్నా, తినకపోయినా చాలా మంది బరువు అధికంగా పెరుగుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉంటున్నాయి. అయితే కొందరు మాత్రం సరైన డైట్‌ను పాటిస్తూ నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉంటున్నారు. అయితే నిజానికి వారు బరువు తగ్గకపోవడం వారి తప్పు కాదు. మరి అందుకు కారణాలు ఏమిటో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా.
పేగుల్లో ఉండే సూక్ష్మ జీవులు.. మన పేగుల్లో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే అవి మన జీర్ణ ప్రక్రియను నియంత్రిస్తాయి. ఈ క్రమంలో ఎన్ని భిన్నమైన సూక్ష్మ జీవులు జీర్ణాశయం, పేగుల్లో ఉంటే వారు అంత సన్నగా ఉంటారట. అందుకే అలాంటి సూక్ష్మ జీవులు పెరగాలంటే ఎవరైనా పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండే తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలట. దీంతో సూక్ష్మజీవులు పెరుగుతాయి. అవి జీర్ణ ప్రక్రయను క్రమబద్దీకరించి మనల్ని సన్నగా మారేలా చేస్తాయి. జీన్స్.. అధిక బరువు తగ్గకపోవడానికి జీన్స్ కూడా ప్రధాన కారణమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం లేదంటే అందుకు జీన్స్ కూడా ఒక కారణం అయి ఉంటుందని వారు చెబుతున్నారు. మన శరీరంలో బరువు, జీర్ణశక్తి, క్యాలరీలు ఖర్చయ్యే విధానం తదితర అంశాలను 100 రకాలకు పైగా జీన్స్ ప్రభావితం చేస్తాయట. ఈ క్రమంలోనే ఆ జీన్స్ సరిగ్గా పనిచేయకుండా సమస్యలుంటే అవి బరువుపై ప్రభావం చూపుతాయి. అవే కొందరిలో ఆకలి ఎక్కువగా ఉండి ఆహారం ఎక్కువగా తిని బరువు పెరిగేలా చేస్తాయి.
భోజన సమయాలు.. చాలా మంది నేటి తరుణంలో రాత్రి పూట ఆలస్యంగా తింటున్నారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే రాత్రి పూట సహజంగానే మన జీర్ణశక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు జంక్‌ఫుడ్, హెవీ ఫుడ్ తీసుకుంటే అది జీర్ణం కాదు. ఫలితంగా బరువు పెరుగుతారు. కనుక ఎవరైనా రాత్రి పూట మితంగా ఆహారం తీసుకోవడంతోపాటు ఆ భోజనాన్ని రాత్రి 7 గంటల లోపే ముగిస్తే మంచిదట. దీంతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. మెదడు పనిచేసే విధానం.. ఆహారం తినే విషయంలో కొందరికి నిజంగా మెదడు కంట్రోల్‌లో ఉండదు. కొందరు తక్కువ తిని ఎక్కువగా తిన్నామని ఫీలవుతారు. కొందరు ఎక్కువగా తిని తక్కువగా తిన్నామని ఫీలవుతారు. ఇలా భిన్నరకాలుగా వారి మెదళ్లు స్పందిస్తాయి. కనుక ఎవరైనా తిండిని కంట్రోల్ చేయడంతోపాటు మెదడులో తక్కువగా తిన్నామని ఫీల్ కావాలి. అదే అధిక బరువును తగ్గిస్తుంది. ఎక్కువ తినడంతోపాటు అలా తిన్నామని ఫీల్ అయితే అప్పుడు మెదడు స్పందిస్తుంది. దీంతో ఇంకా ఎక్కువ బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుందట. కనుక తిండి, మెదడు కంట్రోల్‌లో ఉండాలి. అప్పుడే బరువు నియంత్రణలో ఉంటుంది.
హార్మోన్లు.. మనకు ఆకలి కావాలన్నా, తింటున్నప్పుడు ఇకా చాలు అనిపించాలన్నా అందుకు హార్మోన్లే కీలకం. అవే మన ఆకలిని నియంత్రిస్తాయి. కానీ నిజానికి కొందరిలో ఈ హార్మోన్లు సరిగ్గా పనిచేయవు. ఎంత తిన్నా ఇంకా కావాలనే చెబుతుంటాయి. దీంతో సహజంగానే ఎవరైనా తిండి అధికంగా తింటారు. అంతేకాకుండా కొన్ని రకాల ఇష్టమైన ఆహారాలను చూస్తే సహజంగానే ఆ తిండి హార్మోన్లు యాక్టివేట్ అయి ఆకలి లేకున్నా అప్పటికప్పుడు ఆకలిని క్రియేట్ చేస్తాయి. దీన్ని గమనించాలి. లేదంటే అధికంగా తిని బరువు పెరుగుతారు. ఇక ఈ హార్మోన్లు ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ఉండేందుకు గాను పలు సూక్ష్మజీవులు ఉపయోగపడతాయని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ సైంటిస్టులు కనుగొన్నారు. వాటిని పేగులు, జీర్ణాశయంలోకి వదిలితే అవి హార్మోన్లను నియంత్రించి ఆకలి సరిగ్గా అయ్యేలా చేస్తాయట. దీంతో తిండి కంట్రోల్‌గా తింటారు. బరువు తగ్గుతారు. అయితే ప్రస్తుతం ఈ విధానం ఒబెసిటీ చికిత్సలో భాగంగా ఉంది. దీన్ని వారు పరీక్షిస్తున్నారు. సక్సెస్ అయితే పూర్తి స్థాయిలో ఈ థెరపీ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.