స్థూలకాయం.. సమయం తప్పించి భోజనం చేయడం.. అధికంగా ఆహారం తీసుకోవడం.. వ్యాయామం చేయకపోవడం.. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తదితర అనేక కారణాల వల్ల మనలో చాలా మంది గ్యాస్ సమస్య వస్తుంటుంది. అయితే ఇవే కాకుండా.. మరొక కారణం వల్ల కూడా గ్యాస్ వస్తుందని సైంటిస్టులు తేల్చారు. అదే.. ఉప్పు ఎక్కువగా తినడం.. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఉప్పులో ఉండే సోడియం మన జీర్ణాశయంలోని పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు వాటిపై ప్రభావం చూపిస్తుందట. దీంతో గ్యాస్ బాగా ఉత్పత్తి అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఫైబర్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కూడా జీర్ణాశయంలో గ్యాస్ బాగా పెరిగిపోతుందని వారు తేల్చారు. ప్రస్తుతం అధిక శాతం మంది ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను తింటుండం వల్ల అది గ్యాస్ సమస్యకు కారణమవుతుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో సైంటిస్టులు చేపట్టిన ఈ అధ్యయనం తాలూకు వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో కూడా ప్రచురించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటి కాగా.. దీన్ని అదుపు చేయాలంటే ఉప్పు తక్కువగా, ఫైబర్ ఒక మోస్తారుగా ఉన్న పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు అన్ని పోషకాలను నిత్యం సమపాళ్లలో తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుందని, దీంతో జీర్ణాశయం పరంగా వచ్చే అన్ని సమస్యల నుంచి బయట పడవచ్చని వారు సూచిస్తున్నారు. కనుక.. ఉప్పు ఎక్కువగా తినేవారు ఇకనైనా జాగ్రత్త వహిస్తే.. గ్యాస్ ట్రబుల్ సమస్య రాకుండా చూసుకోవచ్చు.