Tea : ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నిద్ర లేస్తూనే టీ తాగకపోతే కొందరికి అసలు ఏమీ తోచదు. ఈ క్రమంలోనే కొందరు బెడ్ టీతో తమ దిన చర్యను ప్రారంభిస్తారు. ఇక కొందరు బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాతే టీ తాగుతారు. కొందరు రోజంతా టీ లను అదే పనిగా తాగుతూనే ఉంటారు. అయితే టీలను తాగే వారు కచ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..
పాలు, టీ పొడి, చక్కెర కలిపి మరిగించి టీని తయారు చేస్తారన్న విషయం విదితమే. అయితే టీని రోజూ పరిమిత మోతాదులోనే తాగాలి. రోజుకు 3 కప్పులకు మించి తాగితే మన శరీరంలో కెఫీన్ ఎక్కువగా చేరుతుంది. ఇది నిద్ర లేమి, గ్యాస్ వంటి సమస్యలను కలగజేస్తుంది. కనుక రోజుకు 3 కప్పులకు మించకుండా టీ తాగాలి.
ఇక కొందరు గ్రీన్ టీ లో పాలు, చక్కెర కలిపి తాగుతారు. అలా గ్రీన్ టీని సేవిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీటిలో గ్రీన్ టీ పొడి ఆకులు వేసి మరిగించి అనంతరం వడకట్టి అలాగే తాగేయాలి. అవసరం అనుకుంటే అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. అంతేకానీ.. పాలు, చక్కెర కలిపి గ్రీన్ టీ తాగడం వల్ల బరువు పెరుగుతారు తప్ప తగ్గరు. అలాంటి గ్రీన్ టీతో ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఇక పాలు, చక్కెర లేకుండా కేవలం డికాషన్ మాత్రమే తయారు చేసుకుని తాగితే దాన్ని బ్లాక్ టీ అంటారు. ఇది మనకు సాధారణ టీ కన్నా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శ్వాసవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
బ్లాక్ టీలో నిమ్మరసం, తేనె కలిపి పుదీనా ఆకులు వేసి తాగితే దాన్ని లెమన్ టీ అంటారు. దీని వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
అయితే కేవలం సాధారణ టీ మాత్రమే కాకుండా, రోజూ ఒక కప్పు బ్లాక్ టీ, ఒక కప్పు గ్రీన్ టీ, ఒక కప్పు లెమన్ టీ ఇలా తాగితే ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని ఏవైనా ఎంపిక చేసుకుని 3 కప్పుల మోతాదులో తాగాలి. మోతాదుకు మించితే శరీరంలో కెఫీన్ ఎక్కువగా చేరుతుంది. అది అనర్థాలను కలగజేస్తుంది.
ఇక బెడ్ టీ తాగేవారు ఆ అలవాటును మానుకోవాలి. దీని వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. పరగడుపున టీ తాగడం అంత మంచిది కాదు. బ్రేక్‌ఫాస్ట్ చేశాక టీ తాగవచ్చు.