Diabetes : డయాబెటిస్.. నేటి తరుణంలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, హార్మోన్ సమస్యలు, స్థూలకాయం, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి డయాబెటిస్ వస్తోంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. వంశ పారం పర్యంగా వచ్చే టైప్ 1 డయాబెటిస్ ఒకటి కాగా, ముందు చెప్పిన కారణాల వచ్చేది మరో రకం టైప్ 2 డయాబెటిస్. అయితే ఏ డయాబెటిస్ అయినా అది వచ్చే ముందు శరీరం కొన్ని లక్షణాలను, సంకేతాలను చూపుతుంది. వాటిని గుర్తించడం ద్వారా డయాబెటిస్ ఉందని మనం తెలుసుకోవచ్చు. దీంతో తొలి దశలోనే వ్యాధిని గుర్తించి త్వరగా చికిత్స తీసుకుంటే తద్వారా ఎంతో మేలు జరుగుతుంది. మరి ఎవరిలో అయినా డయాబెటిస్ వచ్చిందని తెలియజేసే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
డయాబెటిస్ ఉన్న వారికి దాహం ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే మూత్ర విసర్జన కూడా ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్‌ను బయటకు పంపేందుకు శరీరానికి నీరు అవసరం. అందుకే మనకు దాహం వేస్తుంది. ఇక అలా దాహం వేసినప్పుడు తాగిన నీరు గ్లూకోజ్ తో కలిసి మూత్రం రూపంలో నిరంతరం బయటకు వస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు మూత్రం చేయాల్సి వస్తుంటుంది. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులు 4 నుంచి 10 సార్ల వరకు మూత్ర విసర్జన చేయవచ్చు. ఆ స్థాయి దాటితే దాన్ని డయాబెటిస్ గా గుర్తించాలి. ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ వచ్చిందని తెలుసుకోవాలి.
పైన చెప్పిన అధిక దాహం, మూత్ర విసర్జనతోపాటు అధికంగా ఆకలి కూడా ఉంటే దాన్ని కచ్చితంగా డయాబెటిస్‌గా నిర్దారించాల్సిందే. ఎందుకంటే శరీరంలో తయారయ్యే ఇన్సులిన్‌ను కణాలు గ్రహించలేవు. దీంతో మనం ఆహారం తిన్నప్పటికీ అది గ్లూకోజ్ మారినా కూడా రక్తంలో అలాగే ఉంటుంది. కణాలు గ్లూకోజ్‌ను వాడుకోవు. ఫలితంగా వాటికి శక్తి అవసరం అవుతుంది. దీంతో మెదడు ఆకలి సిగ్నల్‌ను పంపుతుంది. అందువల్లే ఆకలి వేస్తుంది. తిన్న వెంటనే బాగా ఆకలి వేస్తుంటే దాన్ని డయాబెటిస్‌గా గుర్తించాలి.
డయాబెటిస్ ఉన్నవారు చిన్న పని చేసినా తీవ్రంగా అలసిపోతారు. అసలు పనిపై ఏ మాత్రం శ్రద్ధ చూపించలేరు. దీనికి తోడు ఎప్పుడూ అలసిపోయి నిద్ర వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. ఈ లక్షణాలు గనక ఉంటే డయాబెటిస్ ఉందేమోనని అనుమానించాలి. వైద్యున్ని కలసి చికిత్స తీసుకోవాలి. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి కళ్లు మసకగా కనిపిస్తాయి. కళ్లలో ఉండే ద్రవాల అసమతుల్యత కారణంగా ఇలా జరుగుతుంది. అయితే డయాబెటిస్ అదుపులో ఉంటే ఈ సమస్య రాదు. కానీ చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది శాశ్వత అంధత్వానికి దారి తీసేందుకు అవకాశం ఉంటుంది.
ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పాటించకపోయినా సడెన్‌గా, ఉన్నట్టుండి బరువు తగ్గుతుంటే దాన్ని డయాబెటిస్‌గా అనుమానించాలి. శరీర కణాలకు శక్తి సరిగ్గా అందదు కనుక బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి చర్మం దురదగా ఉంటుంది. ఎందుకంటే ఒంట్లో ఉండే నీరు అధిక మొత్తంలో బయటకు పోతుంది. దీంతో చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా చర్మం దురదగా అనిపిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి గాయాలు అయితే అవి త్వరగా మానవు. ఎందుకంటే గాయాల వద్దకు రక్తం సరిగా చేరుకోదు. రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీంతో గాయం వద్ద డ్యామేజ్ అయిన కణాలు త్వరగా రిపేర్ అవవు. ఫలితంగా గాయం మానడం ఆలస్యమవుతుంది. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.
మెడ, చంకలు, గజ్జలు, మోచేతులు, మోకాళ్ల వద్ద చర్మంపై డార్క్ ప్యాచ్‌లు ఉన్నా అనుమానించాలి. అది డయాబెటిస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదని చెప్పాం కదా. అయితే ఈ రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం మూలాన శరరీంలో ఉండే కణాలు దీర్ఘకాలంలో దెబ్బ తింటాయి. దీంతో కణాలు దెబ్బ తిన్న చోటల్లా స్పర్శ లేకపోవడం లేదా ఆ ప్రాంతంలో సూదులతో గుచ్చినట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నా అది డయాబెటిస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక వెంటనే డాక్టర్‌ను కలిస్తే మంచిది. దీంతో పరీక్షలు చేయించుకుని షుగర్ ఉన్నదీ లేనిదీ నిర్దారించుకోవచ్చు. ఒకవేళ ఉంటే అందుకు అనుగుణంగా ముందుగానే చికిత్స తీసుకోవచ్చు. దీంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి.