Over Weight : అస్తవ్యస్తమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా నగరాల్లో ఇది ఎక్కువైపోయింది. ప్రజలు తన పని బిజీలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీంతో ఊబకాయం బారిన పడి అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఇక బరువును నియంత్రించుకోవడం కోసం చాలా మంది పలు మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయామం చేస్తారు. కొందరు యోగాను ప్రారంభిస్తారు. అయితే బరువు తగ్గే ప్రయత్నంలో కొందరు చేసే తప్పుల కారణంగా బరువు తగ్గకపోగా.. బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో వారు చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు సులభంగా తగ్గవచ్చు అని చెప్పి కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. నేరుగా మధ్యాహ్నం లంచ్ చేస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఉదయం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. రాత్రంతా మన శరీరానికి ఎలాంటి ఆహారం అందదు. కనుక ఉదయం శక్తి కోసం శరీరం మనం తినే ఆహారంపై ఆధార పడుతుంది. అలాగే పోషకాలు కూడా మనకు ఎక్కువగా ఉదయం ఆహారం నుంచే వస్తాయి. అలాంటప్పుడు ఉదయం ఆహారం మానేస్తే మనకు లాభం కలగకపోగా నష్టమే జరుగుతుంది. అలాగే ఉదయం ఆహారం మానేసేవారు రోజులో ఇతర సమయాల్లో సాధారణం కన్నా ఎక్కువే తింటారట. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయకూడదు. ఏదో ఒకటి తినాల్సిదే. కావాలంటే రాత్రి పూట త్వరగా భోజనం చేయవచ్చు. లైట్‌గా తినవచ్చు. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
ఇక మనం తినే ఆహారం జీర్ణం అయి మనకు పోషకాలు, శక్తి సరిగ్గా లభించాలంటే రోజూ తగినన్ని నీళ్లను తాగడం చాలా అవసరం. కొందరు నీళ్లను ఎక్కువగా తాగరు. ఎంత ఆహార నియమాలను పాటించినా నీళ్లను తాగకపోతే బరువు తగ్గరు. బరువు పెరుగుతారు. కనుక రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. అలాగే కొందరు ఉదయాన్నే అనారోగ్యకరమైన ఆహారంతో రోజును ప్రారంభిస్తారు. చక్కెర లేదా నూనె పదార్థాలను ఉదయాన్నే ఎక్కువగా తింటారు. ఇది కూడా బరువును పెంచుతుంది. మీరు బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉంటే ఉదయం ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారాలను తినాలి. ఇవి బరువు తగ్గేందుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇలా కొన్ని తప్పులు జరగకుండా చూసుకుంటే మీరు త్వరగా బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.