Japan People Habits : ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మంది ఇలాంటి జీవితాన్ని గడపలేకపోతారు. ఎంత ప్రయత్నించిన కూడా చక్కటి జీవితాన్ని గడపలేకపోతూ ఉంటారు. అయితే ఇలాంటి ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారు జపనీస్ ప్రజల సిద్దాంతాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జపనీస్ ప్రజల అలవాట్లు, వారి జీవన విధానం కారణంగా వారు అందమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు జపనీస్ ప్రజల ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధానం ఏమిటి.. వారు పాటించే నియమాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జపనీస్ ప్రజలు ఎక్కువగా సముద్రపు ఆహారాన్ని, కూరగాయలను, లీన్ మాంసాన్ని తీసుకుంటారు. అలాగే వారు పొట్ట 80 శాతం నిండే వరకే తింటారు. దీంతో వారు తగినంత బరువు ఉండడంతో పాటు శరీర ధృడత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే వారు జెన్ బౌద్దమతాన్ని విశ్వసిస్తారు. ఇది వారికి సరళమైన, సాధారణమైన, గందరగోళం లేనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ప్రేరేపిస్తుంది. దీంతో వారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే జపనీస్ ప్రజలు ఇకిగాయ్ భావజాలాన్ని అనుసరిస్తారు. ఇది వారి మానసిక శ్రేయస్సును, భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేయడంలో సహాయపడుతుంది. వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండడానికి ప్రాముఖ్యతను ఇస్తారు. చిన్న విషయాలకు ఎక్కువగా అరవకుండా, మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. దీంతో వారు శక్తి స్థాయిలు పడిపోకుండా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ప్రతిరోజూ వ్యాయామం చేయడం కూడా వారి అలవాట్లల్లో ఒకటి.
వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గుండె చురుకుగా పని చేస్తుంది. అలాగే రోజూ తగినంత నిద్రపోవడం కూడా వారికి ఉన్న ఒక మంచి అలవాటు. తగినంత నిద్రపోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. నీరసం మన దరి చేరకుండా ఉంటుంది. నిద్రపోవడం వల్ల శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. దీంతో మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అలాగే జపనీస్ ప్రజలు గ్రీన్ టీని ఎక్కువగా తాగుతారు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం యొక్క శక్తి స్థాయిలు మెరుగుపడుతాయి. శరీర బరువు అదుపులో ఉంటుంది. అలసట దరి చేరకుండా ఉంటుంది. అలాగే నీటిని ఎక్కువగా తాగడం కూడా వారికి ఉన్న మంచి అలవాట్లల్లో ఒకటి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి.
గుండె కొట్టుకునే వేగం పెరగకుండా ఉంటుంది. శరీరంలో శక్తి తగ్గకుండా ఉత్సాహంగా, ఏకాగ్రతతో పని చేసుకోగలుగుతాము. అలాగే వారి వర్క్ కల్చర్ కూడా వారు ఆరోగ్యంగా ఉండడానికి ఒక కారణం. వారి వర్క్ కల్చర్ విధేయత, అంకితభావం, మనశ్శాంతిగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది. దీంతో వారు ఒత్తిడి లేకుండా పని చేసుకోగలుగుతారు. ఈవిధమైనటు వంటి జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మనం కలిగి ఉండడం వల్ల మనం కూడా రోజంతా ఉత్సాహంగా, అలసట లేకుండా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాము. అందమైన. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతాము.