Jaundice Diet : పచ్చ కామెర్ల వ్యాధి అనేది లివర్‌లో వచ్చే సమస్య వల్ల వస్తుంది. లివర్ పనితీరు బాగా మందగించినప్పుడు లేదా రోగ నిరోధక శక్తి మరీ తక్కువైనప్పుడు ఇలా పచ్చ కామెర్ల వ్యాధి వస్తుంటుంది. సాధారణంగా కామెర్ల వ్యాధి అప్పుడే పుట్టిన చిన్నారులకు ఎక్కువగా వస్తుంది. అయితే చిన్నారులకే కాదు.. పెద్దలకు కూడా కామెర్లు వస్తుంటాయి. కామెర్లు వచ్చినవారి శరీరం పసుపు రంగులోకి మారుతుంది. ఎందుకంటే బైలిరుబిన్ అనే ఒక పదార్థం రక్తంలో ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో కామెర్లు వస్తాయి. శరీరం పసుపు రంగులోకి మారుతుంది. గోర్లపై ఒత్తిడి కలిగిస్తే పసుపు రంగులో లేదా పాలిపోయి కనిపిస్తాయి. అలాగే కళ్లు కూడా పసుపు రంగులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటే పచ్చకామెర్లు వచ్చినట్లే అర్థం చేసుకోవాలి.
ఇక పచ్చకామెర్లు వచ్చిన వారు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను.. అందులోనూ ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో కామెర్ల నుంచి త్వరగా కోలుకుంటారు. ఇక పచ్చ కామెర్లను తగ్గించడంలో ముల్లంగి రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని రసాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. లేదా ముల్లంగి ఆకులను నీటిలో మరిగించి అయినా తీసుకోవచ్చు. దీంతో కామెర్ల నుంచి త్వరగా బయట పడవచ్చు.
క్యారెట్లు కూడా కామెర్లను తగ్గించగలవు. పూటకు ఒక క్యారెట్‌ను తింటున్నా లేదా ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను రోజుకు 2 సార్లు తాగుతున్నా కూడా పచ్చ కామెర్లు తగ్గుతాయి. అలాగే బీట్‌రూట్ లను లేదా వాటి జ్యూస్‌ను కూడా తీసుకోవచ్చు. ఇక చెరకు రసం కూడా కామెర్లను తగ్గించగలదు. దీన్ని తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్‌కు బలం లభిస్తుంది. దీంతో లివర్ ఆరోగ్యంగా మారుతుంది. ఫలితంగా కామెర్లు తగ్గుతాయి. అలాగే టమాటా రసం కూడా బాగానే పనిచేస్తుంది.
టమాటాల్లో మనకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు, సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే లైకోపీన్ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల రోజూ టమాటా రసాన్ని కూడా తాగాల్సి ఉంటుంది. దీంతో త్వరగా కోలుకోవచ్చు. అలాగే రోజూ ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసాన్ని తాగుతున్నా కూడా లివర్ త్వరగా రికవరీ అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. దీంతో కామెర్లు తగ్గుతాయి. ఇక ఇవే కాకుండా కామెర్లను తగ్గించడంలో పలు ఆహారాలు కూడా బాగానే పనిచేస్తాయి. అందుకు గాను తృణ ధాన్యాలను, బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, కిస్మిస్, ఎండు ద్రాక్షలను, పప్పు దినుసులను, తాజా పండ్లు, కూరగాయలను, హెర్బల్ టీ లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నీళ్లను కూడా ఎక్కువగా తాగుతుండాలి. ఇలా ఆహార నియమాలను పాటిస్తే కామెర్ల నుంచి త్వరగా కోలుకుంటారు. శరీరం పూర్వపు స్థితిలోకి మారిపోతుంది.