ఆయుర్వేదంలో ఎన్నో మూలికలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. చాలా వరకు మూలికలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మన వంట ఇళ్లలో ఉంటాయి. కొన్నింటిని ఇంటి చుట్టు పక్కల పెంచుకుంటాం. ఇక కొన్ని మార్కెట్‌లో లభిస్తాయి. అయితే కింద తెలిపిన 10 ఆయుర్వేద మూలికలను మాత్రం ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ మూలికలు ఏమిటంటే..
1. అశ్వగంధ
అశ్వగంధ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. ఇది చూర్ణం, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది.
2. వాము
వాము గింజలు మన వంట ఇంట్లోనే ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. గ్యాస్, అసిడిటీ, వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారం తగ్గుతాయి. వాము గింజలను నేరుగా ఒక టీస్పూన్ మోతాదులో నమిలి మింగవచ్చు. లేదా నీటిలో వేసి మరిగించి డికాషన్‌ను తాగవచ్చు.
3. బ్రహ్మి
ఇది పొడి, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. చిన్నారుల్లో జ్ఞాపశక్తిని పెంచుతుంది. నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. యాలకులు
యాలకులు కూడా మన వంట ఇంట్లోనే ఉంటాయి. వీటితో బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. జీలకర్ర
అధిక బరువును తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు ఉండవు. షుగర్ లెవల్స్, బీపీ తగ్గుతాయి. ఇవి కూడా మన కిచెన్‌లోనే ఉంటాయి. జీలకర్రను కషాయం చేసి తాగితే మంచిది.
6. తులసి
తులసి మొక్క మన ఇంటి చుట్టు పక్కల పెరుగుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది. వికారం, జీర్ణ సమస్యలు, అసిడిటీ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తులసి ఆకుల రసాన్ని రోజూ తీసుకోవచ్చు.
7. వేప
వేప చెట్లు కూడా మన ఇంటి చుట్టు పక్కలే పెరుగుతాయి. వీటి ఆకులను తింటుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. షుగర్, కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తాయి. వేప ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి కూడా వాడవచ్చు.
8. పసుపు
ఇది మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని నీటిలో వేసి మరిగించి డికాషన్ రూపంలో తీసుకోవచ్చు. లేదా వేడి పాలలో కలిపి తీసుకోవచ్చు. పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. నొప్పులు, వాపులు తగ్గుతాయి.
9. అతి మధురం
ఇది చూర్ణం రూపంలో లభిస్తుంది. అజీర్ణం, వాపులు, జీర్ణాశయ అల్సర్లు, చర్మంపై దద్దుర్లను, వాపులను తగ్గిస్తుంది. దీన్ని నెయ్యి, తేనె, వేడినీళ్లతో కలిపి తీసుకోవచ్చు.
10. అల్లం
ఇది కూడా మనందరి ఇళ్లలో ఉంటుంది. అల్లం రసంను సేవించవచ్చు. లేదా అల్లం వేసి మరిగించిన నీటిని తాగవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. వికారం, వాంతులు తగ్గుతాయి.
ఇవే కాకుండా లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు తదితర మూలికలను కూడా ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే తగ్గించుకునేందుకు వీలుంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365