Lemon Juice : నిమ్మరసంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు పోతాయి. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే నిమ్మరసం తాగితే మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే. అయితే నిమ్మరసం మేలు చేస్తుంది కదా అని చెప్పి దాన్ని మోతాదుకు మించి మాత్రం తాగకూడదు. ముఖ్యంగా రోజుకు 1 లేదా 2 నిమ్మకాయలను పూర్తిగా పిండి తీసిన రసాన్ని మాత్రమే తాగవచ్చు. అంతకు మించిన మోతాదులో నిమ్మరసం తాగితే మాత్రం మనకు నష్టమే కలుగుతుంది. ఈ క్రమంలోనే నిమ్మరసం అధికంగా తాగడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం ఎక్కువగా తాగితే కడుపులో యాసిడ్‌ల శాతం పెరుగుతుంది. దీంతో కడుపు మంట వస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి వంటివి వస్తాయి. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల అందులో ఉండే విటమిన్ సి మనకు అనారోగ్యాలను కలగజేస్తుంది. డయేరియా, వాంతులు, వికారం వంటివి సంభవిస్తాయి. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే మూత్రాశయం ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో ఆ భాగంపై అధిక ఒత్తిడి పడుతుంది. మూత్రాశయ సంబంధ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. శరీరంలో ద్రవాలు త్వరగా ఖర్చవుతాయి.
ఎక్కువగా నిమ్మరసం తీసుకుంటే దంతాలు క్షయం అవుతాయి. త్వరగా పుచ్చిపోతాయి. దంత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంతాలపై ఉండే ఎనామిల్ పోతుంది. దంతాలు, చిగుళ్లు నొప్పి చేస్తాయి. మోతాదుకు మించి నిమ్మరసం తాగితే నోట్లో యాసిడ్ ప్రభావం పెరిగి నాలుక పగులుతుంది. రుచి గ్రహించే కళికలు సరిగ్గా పనిచేయవు. పేగులు, జీర్ణాశయంలో పుండ్లు పడే అవకాశం ఉంటుంది. కనుక అవసరం అయినంత మేర మాత్రమే నిమ్మరసాన్ని తాగాల్సి ఉంటుంది.