Lemon Juice : మనలో చాలా మందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది. బియ్యం తింటే రక్తం విరిగి పోతుందని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే మట్టి తిన్నా, బలపాలు తిన్నా నిమ్మ రసాన్ని ఎక్కువగా తీసుకున్నా, నారింజ పండ్లను ఎక్కువగా తీసుకున్నా ఆ పులుపుకు రక్తం విరిగిపోతుందని మన పెద్దలు చెబుతుంటారు. అసలు రక్తం విరిగిపోతుందా, విరిగిపోదా అసలు ఈ పదం ఎలా వచ్చింది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం పాలు మరిగించేటప్పుడు లేదా మరిగిన తరువాత అందులో నిమ్మరసం వేస్తే అవి ఉండవలసిన స్థితిలో ఉండకుండా పలుకులు పలుకులుగా, ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి.
నీళ్లు వేరుగా, పాలల్లో ఉండే ప్రోటీన్లు వేరుగా అయిపోతూ ఉంటాయి. నిమ్మరసం పాలను విరిగొట్టినట్టే బియ్యం ఎక్కువగా తిన్నా, తినకూడని పదార్థాలు తిన్నా రక్తం కూడా అలాగే విరిగిపోతుందని పెద్దలు చెబుతుంటారు. అసలు రక్తం విరిగిపోవడం అనేదే ఉండదు. నిమ్మరసం పాలను విరగొట్టినట్టు రక్తంలో కలిసి రక్తాన్ని విరగొట్టదని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకున్న నిమ్మరసం నేరుగా రక్తంలో కలవదు. అలాగే బియ్యం కూడా అవి నేరుగా రక్తంలో కలవవు. వీటిని తినడం వల్ల రక్తం విరిగిపోవడం జరగదని, ఇవి చెడ్డ అలవాట్లు కనుక వాటిని దూరం చేయడానికి మాత్రమే రక్తం విరిగిపోతుందని చెప్పేవారని నిపుణులు తెలియజేస్తున్నారు. మట్టి, బియ్యం, బలపాలు వంటి వాటిని తినడం వల్ల ఇతర నష్టాలు శరీరానికి కలుగుతాయి కానీ రక్తం విరగడం మాత్రం జరగదు.
నిమ్మకాయలు, నారింజ కాయలను ఎక్కువగా తీసుకున్నా, ఉసిరి కాయలను తీసుకున్నా, పుల్లటి పచ్చి మామిడికాయలు తీసుకున్నా కూడా దంతాల పై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది కనుక వాటిని ఎక్కువగా తీసుకోకూడదని చెప్పేవారు. కానీ వాటిని తీసుకోవడం వల్ల రక్తం విరిగిపోవడం మాత్రం జరగదు. బియ్యం, మట్టి, బలపాల వంటి వాటిని శరీరంలో క్యాల్షియం, ఐరన్ లోపించడం వల్ల తింటారని వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో హాని కలుగుతుందని కనుక వాటిని తీసుకోకూడదని అలాగే నిమ్మరసంతో పుల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా దంతాలు పాడైపోతాయని.. ఇలా వారికి నిజాలు మాత్రమే అర్థమయ్యేలా చెప్పాలని, రక్తం విరిగిపోతుందని లేని అబద్దాలను, భయాలను కలిగించకూడదని నిపుణులు చెబుతున్నారు.