Makhana : ఫూల్ మఖనా.. తామర గింజల నుండి వీటిని తయారు చేస్తారు. మనకు ఆన్ లైన్ లో, సూపర్ మార్కెట్ లలో ఇవి విరివిరిగా లభిస్తాయి. ఫూల్ మఖనాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఫూల్ మఖనాలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. 100 గ్రాముల ఫూల్ మఖనాలో 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.1 గ్రాముల కొవ్వు, 350 గ్రాముల శక్తి, 7.6 గ్రాముల ఫైబర్, 210 మైక్రో గ్రాముల సోడియం, 90 మైక్రో గ్రాముల ఫాస్పరస్, 500 మైక్రో గ్రాముల పొటాషియం, 1.4 మైక్రో గ్రాముల ఐరన్, 9.7 గ్రాముల ప్రోటీన్, 60 మైక్రో గ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి.
బరువు తగ్గడంలో ఫూల్ మఖనా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది. ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. అదే విధంగా ఫూల్ మఖనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో, నిద్రలేమిని తగ్గించడంలో కూడా ఫూల్ మఖనా మనకు సహాయపడుతుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరుకుండా ఉంటాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఫూల్ మఖనా మనకు సహాయపడుతుంది.
ఫూల్ మఖనాను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభిస్తుంది. దీంతో కండరాలు బలంగా, ధృడంగా తయారవుతాయి. ఫూల్ మఖనా యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది చక్కటి ఆహారమని చెప్పవచ్చు. ఫూల్ మఖనాను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే వీటిలో పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు, మలినాలు తొలగిపోతాయి. ఈ విధంగా ఫూల్ మఖనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.