Korean Fried Chicken : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీస్ లో కొరియన్ ఫ్రైడ్ చికెన్ కూడా ఒకటి. కొరియన్ స్టైల్ లో చేసే ఈ ఫ్రైడ్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్టాటర్ గా తినడానికి ఈ చికెన్ వెరైటీ చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ లలో మాత్రమే లభించే ఈ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనకు సులభంగా లభించే పదార్థాలతో కొరియన్ ఫ్రైడ్ చికెన్ ను ఇంట్లోనే ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ వింగ్స్ విత్ స్కిన్ – 600 గ్రా., కోడిగుడ్డు – 1, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ముప్పావు కప్పు, మైదాపిండి – అర కప్పు, వంటసోడా – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
టాసింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, టమాట కిచప్ – 3 టేబుల్ స్పూన్స్, చిల్లీ పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, బ్రౌన్ రైస్ సిరప్ – 3 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, వేయించిన నువ్వులు – ఒక టీ స్పూన్.
కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ వింగ్స్ ను ఉప్పు నీటిలో వేసి గంట పాటు నానబెట్టాలి. తరువాత నీరంతా పోయేలా పూర్తిగా వీటిని వడకట్టుకోవాలి. తరువాత చికెన్ వింగ్స్ ను జాయింట్స్ వద్ద కట్ చేసి ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కోడిగుడ్డు, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి.
నూనె వేడయ్యాక సగం చికెన్ ను వేసి వేయించాలి. దీనిని మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన వేసి వేయించాలి. దీనిని కూడా 15 నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా వేయించిన చికెన్ ను కూడా వేసి పెద్ద మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు వేసి పది సెకన్ల పాటు వేయించాలి. తరువాత టమాట కిచప్, చిల్లీ పేస్ట్, బ్రౌన్ రైస్ సిరప్ వేసి కలపాలి. తరువాత మిరియాల పొడి, వెనిగర్, ఉప్పు వేసి కలపాలి.
సాసెస్ కొద్దిగా చిక్కబడిన తరువాత వేయించిన చికెన్ వేసి పెద్ద మంటపై టాస్ చేసుకోవాలి. సాసెస్ ముక్కలకు పట్టిన తరువాత నువ్వులు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొరియన్ ప్రైడ్ చికెన్ తయారవుతుంది. బ్రౌన్ రైస్ సిరప్ మనకు ఆన్ లైన్ లో చాలా సులభంగా దొరుకుతుంది. ఇది అందుబాటులో లేని వారు తేనెలో ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసి కలిపి వాడుకోవచ్చు. సోయాసాస్ ను చిల్లీ పేస్ట్ వేసేటప్పుడే వేసేయాలి. అలాగే తేనెను చికెన్ వేసిన తరువాత వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ఈ కొరియన్ ఫ్రైడ్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.