Nails Health : మనం అందంగా కనిపించడంలో మన చేతి గోర్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన గోర్లను చూసి కూడా మన ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు. గోర్లు అందంగా కనిపించడానికి చాలా మంది ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన గోర్లు సహజ సిద్దంగా అందంగా కనిపిస్తాయి. అలాగే చాలా పొడవుగా పెరుగుతాయి. గోర్లు అందంగా, చక్కగా పొడవుగా పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోర్ల పెరుగుదలకు ప్రోటీన్ ఎంతో అవసరం. గుడ్లు, చేపలు, టోఫు, చిక్కుళ్లు, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల గోర్లు చక్కగా పెరుగుతాయి. అలాగే బయోటిన్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.
గుడ్లు, గింజలు, చిలగడదుంప వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత బయోటిన్ అందుతుంది. మనలో చాలా మందిలో గోళ్లు పెళుసుగా ఉంటాయి. ఐరన్ లోపం వల్ల ఇలా జరుగుతుంది. లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, బీన్స్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ అంది గోళ్లు ధృడంగా మారతాయి. గోర్లు ఆరోగ్యంగా కనిపించడంలో జింక్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. గింజలు, తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తులు వంటి వాటిని తీసుకోవడం వల్ల తగినంత జింక్ అందుతుంది. అలాగే ఆరోగ్యకరమైన గోళ్లను దోహదం చేయడంలో విటమిన్ ఇ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. బాదం, పొద్దు తిరుగుడు, బచ్చలికూర, అవకాడో వంటి వాటిని తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ ఇ అందుతుంది.
అలాగే అవిసె గింజలు, వాల్ నట్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ఇవి కూడా గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదే విధంగా ఆరోగ్యకరమైన గోళ్ల కోసం విటమిన్ సి కూడా ఎంతో అవసరం. సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ సి అందుతుంది. గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్ గా ఉండడం కూడా చాలా అవసరం. కనుక రోజూ తగినన్ని నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు గోళ్లు అందంగా కనిపించాలని చాలా మంది నెయిల్ పాలిష్ లను, నెయిల్ పాలిష్ రిమూవర్లను వాడుతూ ఉంటారు. వీటిలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గోళ్లను దెబ్బతీస్తాయి. కనుక వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. అలాగే గోళ్లు దెబ్బతినకుండా ఉండడానికి ఇంటి పనులు, తోటపని చేసేటప్పుడు గ్లౌసులు వంటి వాటిని ధరించాలి. ఈ విధంగా తగిన ఆహారాలను తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.