Over Weight : అధిక బరువు.. మనల్ని వేధించే సమస్యల్లో ఇది కూడా ఒకటి. నేటి తరుణంలో ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ , నూనెలో వేయించిన పదార్థాలను, కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని మనందరికి తెలుసు. అయితే కేవలం మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే కాకుండా మానసికపరమైన సమస్యల వల్ల కూడా మనం అధిక బరువు బారిన పడుతున్నామని నిపుణులు చెబుతున్నారు. మానసికపరమైన ఈ సమస్యల వల్ల కూడా మనం విపరీతమైన బరువు పెరుగుతున్నామని నిపుణులు తెలియజేస్తున్నారు.
అధిక బరువుకు కారణమయ్యే ఈ మానసిక పరమైన సమస్యలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనల్ని వేధించే మానసికపరమైన సమస్యల్లో ఒత్తిడి కూడా ఒకటి. మనలో చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు చిరుతిళ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. రోజుకు 6 నుండి 7 సార్లు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర బరువు మనకు తెలియకుండానే ఎక్కువగా పెరుగుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికి బదులుగా మనసును దారి మళ్లించాలి. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించాలి. మనసుకు నచ్చిన పనులను ఎక్కువగా చేయాలి. అలాతే మనలో చాలా మంది ప్రతిరోజూ వ్యాయమం చేయాలని నియమం పెట్టుకుంటారు.
కానీ సమయం కుదరక అలాగే బద్దకించి వ్యాయామం చేయడమే మానేస్తారు. దీంతో మన శరీర బరువు పెరుగుతుంది. కనుక ప్రతిరోజూ అరగంట పాటైనా వ్యాయామం, వాకింగ్ చేయాలి. ఏది ఏమైనా వ్యాయామం చేయడం తప్పనిసరి అని గుర్తు పెట్టుకోవాలి. అలాగే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. ఇది మానసికంగా కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఏదో ఆలోచిస్తూ తినేస్తూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఏది తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండానే తినేస్తారు. దీంతో క్రమంగా శరీర బరువు పెరుగుతుంది. కనుక ఆందోళనగా ఉన్నప్పుడు యోగా, ధ్యానం వంటి చేయాలి.
ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. అలాగే బరువు తగ్గడానికి మనలో చాలా మంది రకరకాల డైటింగ్ లను చేస్తూ ఉంటారు. వారమంతా డైటింగ్ చేసి వీకెండ్ లో నచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. బరువు తగ్గాలనే లక్ష్యాన్నే మనం మరిచిపోకూడదు. ఆకలిగా ఉన్నప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. అలాగే కొందరు బరువు తగ్గాలని రోజుకు రెండు పూటలా మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు. ఉదయం అల్నాహారానికి దూరంగా ఉండి మధ్యాహ్నం ఎక్కువగా భోజనాన్ని తీసుకున్నా కూడా శరీరానికి నష్టమే జరుగుతుంది. రాత్రి పూట త్వరగా భోజనం చేయాలి. ఆకలి తగ్గింది అనిపించగానే ఆహారాన్ని తీసుకోవడం ఆపేయాలి. అంతేకానీ ప్లేట్ లో ఉన్నవన్ని అయిపోయే వరకు తినకూడదు.