Poppy Seeds : మనం వంటింట్లో చికెన్, మటన్ లతో కూరలను చేస్తూ ఉంటాం. ఈ కూరలు చిక్కగా రావడానికి, రుచిగా ఉండడానికి మనం రకరకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాం. ఇలా వాడే వాటిలో గసగసాలు ఒకటి. గసగసాలను కూరలలో వాడడం వల్ల కూర చిక్కగా ఉండడంతోపాటు రుచి, వాసన కూడా వస్తాయి. గసగసాలు కూరల రుచులను పెంచడమే కాకుండా వీటిని వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మనకు వచ్చే అనేక సాధారణ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
ఆయుర్వేదంలో కూడా వీటిని ఉపయోగించి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు. గసగసాలను వాడడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. గసగసాలను వాడడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. గసగసాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని వాడడం వల్ల పేగులలో కదలికలు పెరిగి మలబద్దకం సమస్య తగ్గుతుంది. శ్వాస కోశ సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
గసగసాలలో ఉండే ఆక్సలైట్స్ శరీరంలో అదనంగా ఉండే కాల్షియాన్ని గ్రహించి మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పకుండా చేయడంలో దోహదపడతాయి. వీటిని వాడడం వల్ల నోటి పూత సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్న వారు తరచూ గసగసాలను వాడడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా వయస్సు పైబడడం వల్ల వచ్చే దృష్టి లోపాలను నయం చేయడంలోనూ గసగసాలు ఉపయోగపడతాయి.
అరటి పండుతో గసగసాలను అద్దుకుని తినడం వల్ల లేదా వీటిని వేయించి వాటి వాసన చూడడం వల్ల కూడా త్వరగా నిద్రపడుతుంది. వాంతులు, విరేచనాలు, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ గసగసాలు ఎంతో సహాయపడతాయి. గసగసాలను, పంచదారను కలిపి తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. వేయించిన గసగసాలను రోజుకి ఒక టీస్పూన్ చొప్పున తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.