ఫ్యాటీ లివర్‌ సమస్యను తగ్గించుకోవాలంటే.. ఇలా చేయాలి..!

మన శరీరంలోని ముఖ్యమైన అవయాల్లో లివర్‌ కూడా ఒకటి. ఇది సుమారుగా 1.59 కిలోల బరువు ఉంటుంది. 500 కు పైగా పనులను లివర్‌ నిర్వర్తిస్తుంది. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియకు, శరీరంలోని రసాయనాలను బయటకు పంపేందుకు, ప్రోటీన్ల నిర్మాణానికి.. ఇలా అనేక రకాల పనులకు లివర్‌ ఉపయోగపడుతుంది. లివర్‌లో దాదాపుగా 50వేల నుంచి 1 లక్ష వరకు చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. అనేక కణాలన్నీ కలసి పనిచేస్తాయి. అయితే లివర్‌లో దాదాపుగా 90 శాతం వరకు దెబ్బ తినే వరకు మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ లక్షణాలు కనిపిస్తే మాత్రం వ్యాధి తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి.

reduce fatty liver problem in these ways

లివర్‌ సమస్యలు ఉన్నవారిలో గ్యాస్‌, కళ్లు పసుపు రంగులోకి మారడం, చర్మ సమస్యలు రావడం, పాదాలు, చేతుల్లో దురదలు రావడం, బంతి లాంటి పొట్ట ఏర్పడడం వంటివన్నీ లివర్‌ సమస్యలు ఉన్నవారిలో కనిపించే లక్షణాలు. ఇక లివర్ దెబ్బ తినేందుకు అనేక కారణాలు ఉంటాయి.

జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం, మద్యం ఎక్కువగా సేవించడం, పలు రకాల మెడిసిన్లను తీసుకోవడం.. వంటివి లివర్‌ దెబ్బ తినేందుకు కారణమవుతాయి. దీని వల్ల లివర్‌లోని కణాలు నాశనం అవుతాయి. దీంతో లివర్‌ కూడా దెబ్బ తింటుంది. ఈ క్రమంలో లివర్‌లో వాపులు వస్తాయి. అలాగే కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. దీంతో ఫ్యాటీ లివర్‌ వ్యాధి వస్తుంది. ఇది రెండు రకాలు. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల వచ్చేది. ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్. రెండోది నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌. మద్యం సేవించకపోయినా ఇతర అలవాట్లు, పలు కారణాల వల్ల ఇది వస్తుంది. అయితే ఏది వచ్చినా లివర్‌పై దాని ప్రభావం పడుతుంది. కనుక ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారిలో ఆకలి ఉండదు. వాంతులు, వికారం, కడుపునొప్పి ఉంటాయి. కామెర్లు ఉన్నవారిలోనూ ఫ్యాటీ లివర్‌ ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. లేదంటే లివర్‌ ఫెయిల్యూర్‌ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి.

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారు ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి. అధిక బరువు వల్ల కూడా ఇది వస్తుంది కనుక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బరువు సరిగ్గానే ఉన్నవారు దాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇక డయాబెటిస్‌ వల్ల కూడా ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక షుగర్‌ ఉన్నవారు తమ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. దీంతో ఫ్యాటీ లివర్‌ సమస్య పరిష్కారమవుతుంది.

కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలోనూ ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుంటుంది. కనుక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతాయి. చేపలు, గుడ్లు, నట్స్‌ వంటివి ఈ కోవకు చెందుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే లివర్‌ సమస్యలు తగ్గుతాయి.

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారు లివర్‌పై ఎక్కువ భారం పడకుండా చూడాలి. అందుకు గాను తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. ఫైబర్‌ ఉండే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలను తినడం వల్ల ఫైబర్‌, పోషకాలు అందుతాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వీలైనంత వరకు శాకాహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. మాంసాహారం వల్ల లివర్‌పై భారం పడుతుంది. కనుక ఫ్యాటీ లివర్‌ సమస్య తగ్గే వరకు శాకాహారం ఉత్తమం. అలాగే రోజూ వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు నడక సాగించినా చాలు శారీరక శ్రమ జరుగుతుంది. లివర్‌ ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది.

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారు బయటి పదార్థాలు.. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌, నూనె పదార్థాలను అస్సలు తీసుకోరాదు. వీటివల్ల సమస్య మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ పదార్థాలను మానేయాలి.

1. ఇక గ్లాసు గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవిస్తే లివర్‌ వ్యాధులు అన్నీ నయమవుతాయి. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది.

2. రోజూ రెండు పూటలా ఒక కప్పు పెరుగులో కొద్దిగా పసుపు కలిపి కూడా తినవచ్చు. ఇలా చేసినా లివర్‌ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఫ్యాటీ లివర్‌, కామెర్లు వంటి సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది.

3. వేప చెట్టు బెరడుతో తయారు చేసే కషాయాన్ని రోజుకు రెండు పూటలా తాగితే లివర్‌కు బలం కలుగుతుంది.

4. ఆవు పాలలో శొంఠి చూర్ణం కలిపి మరగబెట్టి ఒక గ్లాస్‌ మోతాదులో రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి.

5. నిమ్మ, నారింజ, బత్తాయి, నేరేడు పండ్లు, ఉసిరికాయలను రోజూ తీసుకోవడం వల్ల కూడా లివర్‌కు ఆరోగ్యం కలుగుతుంది. లివర్‌ సమస్యలు తగ్గుతాయి.

Share
Admin

Recent Posts