నేటి తరుణంలో స్థూలకాయం సమస్య అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఊబకాయులుగా మారిపోతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం గడపడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. ఇలా అనేక కారణాల వల్ల చాలా మంది బరువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన విధంగా నియమాలను పాటిస్తే నిజానికి బరువు తగ్గడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. ప్రయత్నిస్తే ఎవరైనా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
కింద సూచించిన నియమాలను రుజిత దివేకర్ అనే పాపులర్ న్యూట్రిషియన్ కమ్ డైటిషియన్ వెల్లడించారు. ఆమె ప్రత్యేకత ఏంటంటే.. సెలబ్రిటీలకు ఆహారం, డైటింగ్ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చి వారి అధిక బరువును ఈమె తగ్గిస్తుంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ 108 కిలోల బరువు తగ్గాడు కదా. దాని వెనుక ఉన్నది ఈవిడే. ఈమె ఇచ్చిన డైట్ ప్లాన్, ఇతర సూచనలతోనే అనంత్ అంబానీ అంతటి భారీకాయుడిగా ఉండి కూడా స్లిమ్ అయ్యాడు. అయితే ఆయనకు ఉన్న ఆస్తమా కారణంగా స్టెరాయిడ్స్ వాడుతూ మళ్లీ బరువు పెరిగిపోయాడు. కానీ అధిక బరువును తగ్గించుకోవడం కోసం రుజిత పలు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎవరైనా తమకు స్థానికంగా దొరికే, పండే పండ్లనే తినాలి. అరటిపండ్లు, ద్రాక్ష, సపోటా, నారింజ, మామిడి.. లాంటి పండ్లను తినాలి. ఈ పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. కనుక ఈ పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, ఆలివ్, రైస్ బ్రాన్ నూనెలను వంటల్లో వాడాలి. ప్రతి రోజూ ఆహారంలో నెయ్యి కచ్చితంగా తీసుకోవాలి. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
రోజూ ఆహారంలో కొబ్బరిని కచ్చితంగా వాడాలి. ఇడ్లీలు, దోశలు, అన్నం తదితరాల్లో కొబ్బరి చట్నీ తినాలి. కొబ్బరి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించి సన్నబడేలా చేస్తుంది. ఓట్స్ గుండె ఆరోగ్యానికి మంచివైనప్పటికీ వాటిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు కనుక వాటిని తినకపోవడమే మంచిది. ఇక వాటితో తయారయ్యే బిస్కెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పండ్ల రసాలను తాగకండి. పండ్లను కొరుక్కుని బాగా నమిలి తినండి. ఇలా చేస్తేనే వాటిల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తరచూ చెరుకు రసాన్ని తాగండి. ఇది శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని క్లీన్ చేస్తుంది. చెరుకు రసం తాగకపోతే కనీసం వాటి ముక్కలు అయినా తినండి. ప్యాక్ చేయబడిన, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తినకండి. అవి శరీర బరువును పెంచుతాయి.
మామూలు తెల్లని అన్నాన్ని భేషుగ్గా తినవచ్చు. బ్రౌన్ రైస్ అయినా ఫరవాలేదు. రైస్ గ్లైసీమిక్ ఇండెక్స్ (తిన్న వెంటనే దేహంలో పెరిగే గ్లూకోజ్) సాధారణంగానే ఉంటుంది. అది పప్పు, పులుసు, పెరుగు వంటి వాటితో కలిస్తే దాని గ్లైసీమిక్ ఇండెక్స్ మరింత తగ్గుతుంది. వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది. దీంతో రైస్‌ను తిన్నా ఏమీ కాదు. గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లోనే ఉంటాయి. రైస్ లో మన శరీరానికి అవసరం అయ్యే మినరల్స్ ఉంటాయి. కాబట్టి రోజుకు మూడుసార్లు కూడా రైస్ తినవచ్చు . ఆకలి తీరే వరకు తినండి. ఎంతైనా తినండి. కానీ ఆకలి లేకుండా మాత్రం ఏమీ తినకండి. మీ పొట్ట ఏమి చెబితే దాన్ని ఫాలో అవండి. రైస్, చపాతీ రెండూ తినవచ్చు, లేదా ఒక్క రైస్ మాత్రమే తినవచ్చు, లేదా కేవలం చపాతీలు మాత్రమే తినవచ్చు. అది మీ ఇష్టం. అలాగే మూడు పూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. మీ ఆకలిని బట్టి తినండి.
మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు. మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలి. ఎన్ని క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తింటున్నామో అని భయపడకండి. ఎన్ని పోషకాలు ఉన్న ఆహారాన్ని తింటున్నారో అది చూసుకోండి. పిజ్జా, పాస్తా, బ్రెడ్, బిస్కట్, కేకులు అస్సలు తినొద్దు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకప్పుడు మన పెద్దలు తిన్న ఆహారాన్ని తినేందుకు యత్నించండి. రోజూ వీలుకాకపోతే కనీసం ఎప్పుడో ఒకసారి అయినా ఆ ఆహారాన్ని తినేందుకు యత్నించండి. రుతువును బట్టి తినండి. వర్షాకాలం లో పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి. ఎందుకంటే ఆకలి రుతువును బట్టి ఉంటుంది. ఒక్కో సీజన్‌లో వేపుళ్ళు తినాలి. తినండి.
ఉదయాన్నే టీ తాగకండి. అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ తాగకండి. రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకుని టీ తాగకండి. గ్రీన్ టీ తాగండి. ఎల్లో టీ, గులాబీ టీ, నీలం టీలను తాగవచ్చు. నిల్వచేసిన ప్యాక్డ్ ఫుడ్, డ్రింక్స్ ఏమీ తీసుకోకండి. నిత్యం వ్యాయామం చేయండి. కఠిన వ్యాయామాలు చేయడం కుదరకపోతే కనీసం రోజూ వాకింగ్ అయినా చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.