Soap Nuts For Hair : మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో షాంపుల వినియోగం కూడా ఒకటి. పూర్వకాలంలో తలస్నానం చేయడానికి కుంకుడు కాయలను మాత్రమే ఉపయోగించే వారు. కుంకుడుకాయలను దంచి, నానబెట్టి వాటి నుండి రసాన్ని తీసి తలస్నానం చేసే వారు. కంకుడుకాయలను ఉపయోగించడం వల్ల జుట్టు మురికి చాలా చక్కగా పోయేది. అలాగే దీనిని ఉపయోగించడం వల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు. కానీ నేటి తరుణంలో మార్కెట్ లో అనేక రకాల షాంపులు ఉన్నాయి.
వీటిని వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుందని ప్రకటనలు ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. వీటిని వాడడం వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ దుష్ప్రభావాలు మాత్రం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. షాంపులల్లో నురుగు రావడానికి రసాయనాలను వాడతారు. షాంపుతో తలస్నానం చేయడం వల్ల కొద్దిగా రుద్దగానే నురుగు వస్తుంది కానీ జుట్టు మురికి మాత్రం పోదు. అలాగే దీనిలో వాడే రసాయనాల కారణంగా జుట్టు విరిగిపోవడం, జుట్టు తెగిపోవడం, జుట్టు రాలడం జరుగుతుంది. కనుక షాంపులకు బదులుగా కంకుడుకాయలను వాడడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది కుంకుడుకాయలను వాడడం ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. కుంకుడుకాయలను వాడడం వల్ల జుట్టు చిక్కులు పడుతుంది. కళ్లు మండుతాయి అని భావిస్తూ ఉంటారు. కానీ కుంకుడుకాయలను వాడడం వల్ల చుండ్రు సమస్యలు తగ్గుతాయి. తలలో చేరిన బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి నశిస్తాయి. పేల సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. కుంకుడుకాయలను ఉపయోగించడం ఇబ్బందిగా భావించే వారు వాటిని పొడిగా చేసుకుని వాడడం మంచిది. ముందుగా కుంకుడుకాయలను దంచాలి. అలాగే వాటిలోపల ఉఏండే గింజలను కూడా దంచాలి.
ఈ గింజలపై ఉండే నల్లటి పెంకును తీసేసి లోపల ఉండే పప్పుతో పాటు కుంకుడుకాయలను ఎండబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని జల్లించి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని నేరుగా జుట్టుపై వేసి వాడుకోవచ్చు లేదా వేడి నీటిలో కలిపి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కుంకుడుకాయలతో సులభంగా జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. ఇలా షాంపులకు బదులుగా కుంకుడుకాయలను వాడడం వల్ల మన జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.