Sprouts Making : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెసర్లు ఒకటి. పెసర్లల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పెసర్లను నేరుగా తీసుకోవడం కంటే వీటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాల సంఖ్య పెరుగుతుంది. అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు అధికమవుతాయి. మొలకెత్తిన పెసర్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొలకెత్తిన పెసర్లను తీసుకోవడం వల్ల జీర్ఱశక్తి పెరుగుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తహీనతతో బాధపడే వారు మొలకెత్తిన పెసర్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా మొలకెత్తిన పెసర్లు మనకు సహాయపడతాయి. అలాగే వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కండరాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవే మొలకెత్తిన పెసర్లను తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే చాలా మంది పెసర్లను మొలక కట్టే పద్దతి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెసర్లు చక్కగా మొలకెత్తాలంటే ఎన్ని గంటల పాటు నానబెట్టాలి.. వీటిని ఏ విధంగా మొలక కట్టాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పెసర్లను చక్కగా మొలకెత్తించాలంటే వీటిని 12 గంటల పాటు నానబెట్టాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పెసర్లను శుభ్రం చేసి తీసుకోవాలి. తరువాత వీటిని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 12 గంటల పాటు నానబెట్టాలి.
ఇలా నానబెట్టిన తరువాత మరోసారి వీటిని శుభ్రంగా కడగాలి. తరువాత పూర్తిగా నీళ్లు పోయేలా వీటిని చక్కగా వడకట్టుకోవాలి. తరువాత ఈ పెసర్లను శుభ్రమైన కాటన్ వస్త్రంలో వేసి మూట కట్టాలి. తరువాత ఈ మూటను ఒక గిన్నెలో ఉంచి దానిపై మూతను ఉంచాలి. తరువాత ఈ గిన్నెపై మరో గిన్నెను బోర్లించి పూర్తిగా గాలి తగలకుండా 12 గంటల పాటు అలాగే ఉంచాలి. 12 గంటల తరువాత పెసర్లు చక్కగా మొలకలు వస్తాయి. వీటిని నెమ్మదిగా వస్త్రం నుండి వేరు చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే కాకుండా మరో పద్దతిలో కూడా వీటిని మొలక కట్టవచ్చు. పూర్తిగా నీళ్లు లేకుండా వడకట్టుకున్న పెసర్లను ఒక స్టెయినర్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ స్టెయినర్ దానికి సరిపడే ఒక గిన్నెలో ఉంచాలి.
తరువాత ఈ గిన్నెపై మూతను ఉంచాలి. ఇప్పుడు ఈ గిన్నెపై మరో గిన్నెను ఉంచి గాలి తగలకుండా చూసుకోవాలి. ఇలా 12 గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా పెసర్లు చక్కగా మొలకలు వస్తాయి. వీటిని కూడా నెమ్మదిగా స్లెయినర్ నుండి వేరు చేసుకోవాలి. మూట కట్టడం కంటే ఈ విధంగా స్టెయినర్ లో వేయడం వల్ల పెసర్లు మరింత చక్కగా మొలకలు వస్తాయి. ఈ విధంగా చక్కగా పెసర్లను మొలకెత్తించి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిలో పెసర్లే కాకుండా ఇతర దినుసులను కూడా మొలకెత్తించి తీసుకోవచ్చు.