Jaggery Powder : మనం తీపి పదార్థాల తయారీలో పంచదారతో పాటు బెల్లాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. పంచదార మన శరీరానికి హానిని కలిగిస్తుంది కానీ బెల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. బెల్లంతో చేసే వంటకాలను తినడం వల్ల దంతాలు పుచ్చి పోకుండా ఉంటాయి. అలాగే బెల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు ధృడంగా ఉంటాయి. బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ శక్తి సక్రమంగా పని చేసేలా చేయడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, స్త్రీలల్లో నెలసరి సమస్యలను తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా బెల్లం మనకు ఉపయోగపడుతుంది. బెల్లాన్ని ఉపయోగించి మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం.
ఈ తీపి వంటకాలను తయారు చేసేటప్పుడు మనం బెల్లాన్ని తురుముకోవాల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా బెల్లం గట్టిగా ఉండి తురుముకోవడానికి, పగల కొట్టడానికి రాదు. అలాంటప్పుడు ఒక చిన్న చిట్కాను ఉపయోగించడం వల్ల బెల్లం మెత్తగా అయ్యి ముక్కలుగా చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. దీని కోసం ఒక గిన్నెలో బెల్లం గడ్డను తీసుకుని దానిని ఫ్రీ హీట్ చేసిన ఒవెన్ లో ఉంచి తరువాత బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల బెల్లం కొద్దిగా మెత్తబడి ముక్కలుగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే అందరికి ఒవెన్ అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు లోతుగా ఉండే కళాయిలో ఉప్పు వేసి వేడి చేయాలి. ఉప్పు బాగా వేడైన తరువాత ఒక గిన్నెలో బెల్లాన్ని తీసుకుని వేడి చేసిన ఉప్పులో కొద్దిగా గుంతగా చేసి బెల్లం గిన్నెను ఉంచాలి.
తరువాత కళాయిపై మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత గిన్నెను బయటకు తీసి బెల్లాన్ని ప్లేట్ లోకి తీసుకుని చాలా సులభంగా తురుముకోవచ్చు లేదా ముక్కలుగా చేసుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల ఎంత గట్టిగా ఉన్న బెల్లం గడ్డైనా కూడా మెత్తబడి ముక్కలుగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనకు బెల్లం గడ్డలతో పాటు బెల్లం పొడి కూడా అందుబాటులో ఉంది. సూపర్ మార్కెట్ లలో బెల్లం పొడి మనకు విరివిరిగా లభ్యమవుతుంది. అయితే అందరికి ఈ బెల్లం పొడి అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా సులభంగా ముక్కలుగా చేసుకుని వంటల్లో వాడుకోవచ్చు.