Khichdi : మనకు అందుబాటులో ఉన్న చిరుధాన్యాల్లో అరికెలు ఒకటి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అయితే ఇరత చిరుధాన్యాల లాగానే వీటిని తినేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. కానీ వీటితోనూ అనేక రకాల వెరైటీలు చేసుకోవచ్చు. ముఖ్యంగా అరికెలతో చేసే కిచిడీ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఉదయాన్నే చేసుకుని బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకోవచ్చు. లేదా లంచ్, డిన్నర్ టైమ్‌లలోనూ దీన్ని తినవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరికెల కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరికెలు – అర కప్పు, పెసరపప్పు – అర కప్పు, పచ్చి బఠానీలు – అర కప్పు, ఉల్లిపాయ – 1, టమాటా – 1, అల్లం తరుగు – ఒక టీస్పూన్, పచ్చి మిర్చి – 2, కరివేపాకు రెబ్బలు – 2, జీలకర్ర – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, కారం – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, పసుపు – కొద్దిగా.
అరికెల కిచిడీ తయారు చేసే విధానం..
అరికెలు, పెసర పప్పును ఓ గిన్నెలో తీసుకుని గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. అది వేడి అయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా తరుగు, పచ్చి బఠానీలు వేసి బాగా కలిపి.. కారం, తగినంత ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి.. అరికెలు, పెసరపప్పు వేసి మూత పెట్టేసి.. ఒక విజిల్ వచ్చాక దింపేయాలి. తరువాత కిచిడీని బాగా కలిపి వడ్డించే ముందు మిగిలిన నెయ్యిని వేస్తే సరిపోతుంది. దీంతో రుచికరమైన ఘుమఘుమలాడే అరికెల కిచిడీ తయారవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. పచ్చి ఉల్లిపాయ ముక్కలను అంచున పెట్టుకుని కాస్త నిమ్మరసం పిండి తింటుంటే.. జిహ్వ లేచి వస్తుంది. దీన్ని చిన్నారులు సైతం లొట్టలేసుకుంటూ తింటారు.
ఇక అరికెలను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక అరికెలు డయాబెటిస్ ఉన్నవారికి గొప్పవరం అనే చెప్పవచ్చు. అలాగే ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానేలా చేస్తాయి. కనుక అరికెలను ఈ విధంగా వండుకుని తింటే ఆయా ప్రయోజనాలు అన్నింటినీ పొందవచ్చు.