Strong Teeth : మనం తీసుకునే ఆహారం మన శరీరంలో ప్రతి అవయవంపై తన ఫ్రభావాన్ని చూపిస్తుంది. మనం చక్కటి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, జీర్ణాశయంపై మాత్రమే మనం తీసుకునే ఆహార ప్రభావం ఉంటుందని భావిస్తారు. కానీ మన దంతాలపై కూడా మనం తీసుకునే ఆహారం ప్రభావం చూపిస్తుంది. మనం చక్కటి ఆహారాన్నితీసుకున్నప్పుడే మన దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నేటి తరుణంలో చాలా మంది దంతాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.
దీనికి కారణం మనం తీసుకునే ఆహారం కూడా. ఎటువంటి దంత సమస్యలు రాకుండా ఉండాలన్నా, అలాగే ఉన్నదంత సమస్యలు తగ్గాలన్నా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం నీటిని ఎక్కువగా తాగాలి. సాధారణంగా మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు మన దంతాలపై, దంతాల సందుల్లో చక్కెరలు, ఆహార పదార్థాలు పేరుకుపోతాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాతో కలిసి దంతాలపై ఉండే ఎనామిల్ ను దెబ్బతిస్తాయి. కనుక నీటిని ఎక్కువగా తాగడం వల్ల దంతాలపై ఉండే బ్యాక్టీరియా శాతం తగ్గుతుంది. దంతాలపై చక్కెరలు, ఆహార పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి.
దీంతో దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పాలను తీసుకోవడం వల్ల కూడా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలను తీసుకోవడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ మరింత బలంగా తయారవుతుంది. అలాగే పాలల్లో ఉండే క్యాల్షియం దంతాలను ధృడంగా చేయడంలో సహాయపడుతుంది. అదే విధంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ దంతాలపై పేరుకుపోయిన పాచిని, క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పంచదార లేని చూయింగ్ గమ్ లను బాగా నమిలి ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు శుభ్రపడతాయి.
అలాగే వంటల్లో కొబ్బరి నూనెను వాడడం వల్ల కూడా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాలు పుచ్చిపోకుండా కాపాడడంలో, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె మనకు ఎంతో దోహదపడుతుంది. అలాగే చక్కటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు రోజూ రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు దంతాల మధ్యలో ఆహారం ఏమి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల మనం మన దంతాలను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.