మన చర్మంపై గాయాలు అయినప్పుడు సహజంగానే రక్తస్రావం అవుతుంది. దాన్ని ఆపేందుకు గాయం వద్దకు రక్తంలోని ప్లేట్‌లెట్లు చేరుకుంటాయి. దీంతో ఆ భాగంలో రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా రక్తస్రావం ఆగుతుంది. ఇలా ప్లేట్‌లెట్లు మనల్ని రక్షిస్తాయి. అయితే రక్తంలో తగినన్ని ప్లేట్‌లెట్లు లేకపోతే రక్తం గడ్డ కట్టదు. దీని వల్ల సమస్యలు వస్తాయి. అలాగే అలసట, చిగుళ్ల నుంచి రక్తం కారడం, సులభంగా గాయాలు అవడం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలు ఎవరికైనా ఉంటే వారిలో ప్లేట్‌లెట్లు సరిగ్గా లేవని అర్థం చేసుకోవాలి. అలాగే డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చినప్పుడు కూడా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ క్రమంలో రక్తంలో ప్లేట్‌లెట్లను పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన ఆహారాలు సహాయ పడతాయి.
1. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్, యాపిల్, గుమ్మడికాయలు, చిలగడ దుంపలు వంటి ఆహారాలను తినడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. ఆయా ఆహారాల్లో ఉండే ప్రోటీన్లు ప్లేట్‌లెట్లు ఉత్పత్తి అయ్యేందుకు సహాయం చేస్తాయి.
2. నారింజ పండ్లు, పాలకూర, ఇతర ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ బి9 అందుతుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది.
3. విటమిన్ కె అధికంగా ఉండే కోడిగుడ్లు, ఆకుపచ్చని కూరగాయలు, మాంసం, క్యాబేజీ, కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
4. విటమిన్ బి12 ఉండే కోడిగుడ్లు, పాలు, చీజ్ వంటి ఆహారాలను తిన్నా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
5. శరీరంలో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఐరన్ అవసరం అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, పప్పు దినుసులు, ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
6. విటమిన్ సి అధికంగా ఉండే మామిడి పండ్లు, పైనాపిల్, టటామాలు, క్యాప్సికం, కాలిఫ్లవర్, నిమ్మకాయలు, ఉసిరికాయలు వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ప్లేట్‌లెట్లను పెంచుకోవచ్చు.
7. గోధుమ గడ్డిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో ప్లేట్‌లెట్‌ల సంఖ్యను పెంచుతాయి.
8. బొప్పాయి పండ్లను తింటున్నా లేదా వాటి ఆకుల నుంచి తీసిన రసాన్ని చాలా స్వల్ప మోతాదులో సేవిస్తున్నా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.