మన చుట్టూ పరిసరాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. అలాగే మనకు బయట అనేక రకాల మూలికలు ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తాయి. అయితే వాటిని ఎలా వాడాలి ? అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ రోజూ తినే ఆహార పదార్థాలతో కలిపి వాటిని తీసుకోవచ్చు. దీంతో అనేక వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
కూర వండే సమయంలో కరివేపాకుతోపాటు కొన్ని తులసి ఆకులు కూడా వేయండి. దీంతో కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ఆకుకూరలతో లేదా కూరగాయలతో పప్పు వండుకుని తింటే తాలింపు వేసి దించే క్రమంలో అందులో నాలుగైదు తులసి ఆకులను వేసి కలపండి. దీంతో ఆ కూర ఆరోగ్యంగా మారుతుంది. తులసి ఆకులను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పని ఉండదు. ఆహారంతోపాటే అవి మనకు అందుతాయి. వారంలో రెండు మూడు రోజులు ఇలా చేస్తే మంచిది.
ఇడ్లీ, దోశ, పుల్కా మొదలైన అల్పాహారాల్లోని కొందరు గృహిణులు కొత్తిమీరతో పచ్చడి చేస్తుంటారు. అయితే ఆ పచ్చడి చేసేటప్పుడు అందులో తులసి ఆకులు, నేల ఉసిరి ఆకులు, పుదీనా, మెంతి ఆకులు వేసి పచ్చడి చేయండి. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి.
టీ తయారు చేసేటప్పుడు అందులో యాలకుల పొడి, పుదీనా, అల్లం వంటి వాటిని వేయండి. అలాగే పాలలో దాల్చిన చెక్క పొడి, అశ్వగంధ చూర్ణం వేసి తాగవచ్చు. తేనె లేదా బెల్లం కూడా వేసి పాలు తాగవచ్చు. దీంతో ఆయా పదార్థాల ప్రయోజనాలను పొందవచ్చు.
ఇంటి పెరట్లో లేదా బాల్కనీలోని కుండీల్లో తులసి, కలబంద, నేల ఉసిరి, పుదీనా, మెంతి మొక్కలను పెంచండి. దీంతో ఎప్పటికప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. అనారోగ్య సమస్యలకే కాక కూరల్లోనే వేయవచ్చు.
నేల ఉసిరి వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందువల్ల ఈ మొక్క ఆకులను రోజూ తింటుండాలి. అలాగే దురదలు వచ్చే వారు వేప, తులసి, నిమ్మ ఆకులు, కలబంద గుజ్జు తినవచ్చు. లేదా వాటన్నింటిని కలిపి మిశ్రమంగా చేసి శరీరానికి రాయాలి. కొంతసేపు ఆగాక స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.