మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. విటమిన్ సి ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే తద్వారా మన శరీరానికి విటమిన్ సి అందుతుంది. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పలు ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా మనకు విటమిన్ సి వల్ల కలుగుతాయి. అయితే విటమిన్ సి ఉన్న ఆహారాలను రోజూ తీసుకుంటేనే దాంతో మనకు లాభం ఉంటుంది. మరి విటమిన్ సి వేటిలో ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా.
1. ఆరెంజ్.. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే మనకు 124 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. అందువల్ల నిత్యం నారింజ జ్యూస్ తాగడం మంచిది. దీంతో మనకు పొటాషియం, ఫోలేట్, లూటీన్, విటమిన్ ఎ తదితర పోషకాలు కూడా లభిస్తాయి. తద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది. 2. గ్రేప్ ఫ్రూట్.. సగం గ్రేప్ ఫ్రూట్‌లో 45 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ కూడా మనకు గ్రేప్ ఫ్రూట్‌ల ద్వారా లభిస్తాయి. 3. క్యాప్సికం.. ఒక మీడియం సైజ్ క్యాప్సికంలో 95 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది మనకు ఒక రోజుకు సరిపోతుంది. అలాగే విటమిన్ ఎ, కె, బి6 లు కూడా క్యాప్సికం ద్వారా మనకు లభిస్తాయి.
4. స్ట్రాబెర్రీ.. ఒక చిన్న కప్పు స్ట్రాబెర్రీ ముక్కలలో 98 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నిషియం తదితర పోషకాలు కూడా మనకు స్ట్రాబెర్రీల ద్వారా అందుతాయి. 5. బ్రొకొలి.. ఒక కప్పు బ్రొకొలి ముక్కల్లో 81 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది మనకు ఒక రోజుకు సరిపోతుంది. అలాగే బ్రొకొలిలో ఉండే కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, కె, యాంటీ ఆక్సిడెంట్లు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. 6. కివి.. కివిలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక చిన్న కివీ పండులో మనకు 60 మిల్లీగ్రాముల విటమిన్ సి దొరుకుతుంది. అలాగే పొటాషియం, ఫైబర్‌లు కూడా మనకు కివీల ద్వారా అందుతాయి.
7. క్యాబేజీ.. పచ్చి క్యాబేజీ కన్నా ఉడకబెట్టిన క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు పచ్చి క్యాబేజీలో దాదాపుగా 30 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అదే ఒక కప్పు ఉడకబెట్టిన క్యాబేజీలో అయితే 60 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ కె, ఫైబర్‌లు కూడా క్యాబేజీలో మనకు లభిస్తాయి. 8. కాలిఫ్లవర్.. ఒక కప్పు పచ్చి కాలిఫ్లవర్‌లో 50 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే కాల్షియం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాలిఫ్లవర్‌లో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మనకు పోషణ లభిస్తుంది.